తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వం ఆయా సంస్థలకు చెల్లించనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 26,887 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న 22,730 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు దశల్లో ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం అందించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. తొలి విడతలో భాగంగా 10,342 పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు. ఇందులో 5,342 స్కూళ్లకు బీఎస్ఎన్ఎల్, మిగిలిన 5,000 స్కూళ్లకు టీ-ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే వెయ్యి పాఠశాలల్లో కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసింది.రెండో విడతలో మిగిలిన 12,388 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. ఇందులో 9,404 పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్, 2,984 పాఠశాలలకు టీ-ఫైబర్ కనెక్షన్లు ఇస్తాయి.
