దేశంలో ప్రధాన రోడ్లు మరణ శాసనాలు రాస్తున్నాయి. దేశవ్యాఫ్తంగా ప్రతిరోజు గంటకు 17 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని రోడ్డు ప్రమాద నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి విడుదల చేశారు. ప్రతి రోజు దేశంలో 1374 ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో 400 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇలా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.46 లక్షల మంది కాగా, ఐదు లక్షల ప్రమాదాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలా ప్రమాదాల్లో మరణించిన వారిలో యువతే ఎక్కువగా ఉండడం బాధాకరం. దేశంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఏకంగా 55 శాతం మంది యువత తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏటా ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.5 శాతం ప్రమాదాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమాదాలు భారీగానే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడో స్ధానం కాగా, తెలంగాణాది 10 స్ధానం. అతి వేగాన్ని నిరోదించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దీన్ని అరికట్టేందుకు భారీ జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది.
