చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్‌జిన్ చేరుకున్న మోడీ.. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు తియాన్‌జిన్ నగరంలో జరుగనుంది. అమెరికా విధించిన భారీ సుంకాలు, చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ సందర్భంగా షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ… భారత్-చైనా పురాతన నాగరికతలుగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు మనవి… అభివృద్ధి చెందుతున్న దేశాల ఐక్యత, పురోగతికి మనిద్దరం బాధ్యత వహించాలి అన్నారు. స్నేహపూర్వక పొరుగు దేశాలుగా పరస్పరం విజయాలు సాధించే భాగస్వాములుగా ముందుకు సాగటం సరైన ఎంపిక అని పేర్కొన్నారు.
జిన్‌పింగ్ వ్యక్తిగత లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపి, అది వెంటనే మోదీకి చేరిందని సమాచారం. అమెరికాతో ఒప్పందాలు బీజింగ్ ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చన్న ఆందోళనను జిన్‌పింగ్ ఆ లేఖలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
