నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో భారత్‌కు ఆర్. ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి…గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరిట ఉన్న 19 ఏళ్లనాటి రికార్డును సమం చేశాడు.
అంతకుముందు తెల్ల పావులతో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద…ఈసారి నల్ల పావులతో ఆడి విజయం సాధించాడు. ఒకే టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన రెండో ఆటగాడిగా లెజెండరీ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రజ్ఞానంద నిలిచాడు.
ఈ విజయంతో 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ ఏడాది క్లాసికల్ గేమ్‌లలో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు ఈ టోర్నమెంట్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న కార్ల్‌సన్ ఇప్పటికే నాలుగు క్లాసికల్ గేమ్‌లలో ఓడిపోవడం విశేషం. ఈ విజయంతో ప్రజ్ఞానంద టైటిల్ గెలిచే అవకాశాలను మరింత మెరుగుపరుచుకున్నాడు.
ప్రజ్ఞానంద ప్రస్తుతం నార్వే చెస్ టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ అతడు గెలిస్తే ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఎనిమిది రౌండ్ల తర్వాత 12 పాయింట్లతో ప్రజ్ఞానంద మూడో స్థానంలో ఉన్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజ్జా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
