భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. చివరి రౌండ్‌లో విన్సెంట్ కీమర్పై విజయం సాధించిన ప్రగ్యానంద, వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌లలో గెలిచి అద్భుత పునరాగమనంతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
అమెరికాకు చెందిన వెస్లీ సో, అలిరెజా ఫిరూజ్జాపై ఆర్మగెడాన్ గేమ్‌లో గెలిచి రెండో స్థానంలో నిలిచాడు. ప్రగ్యానంద చివరి గేమ్‌లో గెలవకపోయి ఉంటే టైటిల్ వెస్లీ సో ఖాతాలో చేరేది. అయితే ప్రగ్యానంద అద్భుత ప్రదర్శనతో 12 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు.
ఫ్రాన్స్‌కు చెందిన అలిరెజా ఫిరూజ్జా మూడో స్థానంలో నిలవగా, ప్రపంచ ప్రఖ్యాత చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.ఈ టోర్నమెంట్‌లో ప్రగ్యానంద పునరాగమనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరో రౌండ్ ముగిసే సమయానికి కేవలం ఆరు పాయింట్లతో పట్టిక చివర్లో ఉన్నాడు. వరుసగా డి. గుకేష్ మరియు వెస్లీ సో చేతిలో ఓటములు ఎదుర్కొన్న అతడు, టోర్నమెంట్‌లో మరో నిరాశాజనక ప్రదర్శన చేయనున్నాడని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగు క్లాసికల్ విజయాలు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో మాగ్నస్ కార్ల్సెన్‌పై రెండు విజయాలు కూడా ఉన్నాయి.
