కర్ణాటక రాష్ట్రంలో ఒక వింతైన మరియు చర్చనీయాంశమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వరుసకు అక్కాతమ్ములయ్యే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకుని, ఇంట్లో వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు రూరల్ పరిధిలో సంచలనం సృష్టిస్తోంది.
బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి ప్రాంతానికి చెందిన శశికళ అనే యువతి, హోసకోటలో నివసించే తన పెద్దమ్మ కుమారుడు ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వరుసకు వీరు అక్కాతమ్ముడు అయినప్పటికీ, ఆ బంధాన్ని పక్కన పెట్టి ప్రేమించుకున్నారు. శశికళకు వివాహ వయస్సు రావడంతో ఆమె తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. పెళ్లి నిశ్చయమవడంతో ఆందోళన చెందిన శశికళ, తన ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరని భావించింది. దీంతో ఆమె ప్రవీణ్‌తో కలిసి ఇంటి నుండి పారిపోయింది. అనంతరం ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు.
వివాహం చేసుకున్న తర్వాత, తమ కుటుంబ సభ్యుల నుండి తమకు ముప్పు ఉందని గ్రహించిన ఈ నూతన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.తాము వరుసకు అక్కాతమ్ములమని, ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించబోరని వారు తెలిపారు. తమ తల్లిదండ్రుల నుండి ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒకే రక్తం పంచుకున్న వారు లేదా వరసకు సోదర సమానులైన వారు వివాహం చేసుకోవడం నిషిద్ధం. అటువంటిది పెద్దమ్మ కుమారుడిని (తమ్ముడిని) వివాహం చేసుకోవడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
