కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం రాత్రి అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన బీదర్-శ్రీరంగపట్నం జాతీయ రహదారి 150A పై కల తుమకూర్లహళ్లి గేట్ సమీపంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బాధితులంతా కారులో బళ్లారి వైపు ప్రయాణిస్తుండగా మొలకాల్మూరు తాలూకా పరిధిలోకి రాగానే ఈ విపత్తు ముంచెత్తింది. జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక ప్రైవేట్ డాబా వద్ద నిలిపి ఉంచిన లారీ వెనుక భాగాన్ని అత్యంత వేగంతో వచ్చిన ఈ కారు అదుపుతప్పి గుద్దింది. ప్రయాణంలో ఉండగా కారు టైరు పేలిపోవడం వల్లే వాహనం డ్రైవర్ అదుపులో లేకుండా పోయిందని.. ఫలితంగానే ఈ ఘోరం జరిగిందని దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు కారు పూర్తిగా నలిగిపోయింది.
మృతుల్లో ఒకరిని చల్లకెరె తాలూకా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురు బాధితులను రుద్రేష్.. సోమ.. మల్లికార్జున్.. ప్రమోద్లుగా నిర్ధారించారు. కారు అతివేగంగా ఉండటం.. అజాగ్రత్తగా నడపడం కూడా ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
