ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండుగా విడిపోయినప్పటి నుంచి..ఆంధ్రా ప్రజల కల ఒక్కటే. ప్రత్యేక హోదా వస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలు ఆశపడ్డారు. విషయం నీతి ఆయోగ్ పరిధిలో ఉందని.. సలహా వచ్చిన వెంటనే కచ్చితంగా స్పందిస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రిపీట్ చేస్తూ వచ్చారు. మరోవైపు చాన్స్ దొరికినప్పుడల్లా.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందంటూ కామెంట్లు చేశారు.
కానీ.. విషయం తమ పరిధిలోనే ఉన్న నీతి ఆయోగ్ సంస్థ మాత్రం.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాస్త తేడాగా స్పందిస్తోంది. కనీసం సొంత రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని చాలా చులకనగా చూస్తోంది. ఏదో ఒక విషయం తేల్చకుండా… ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చింది. నీతి ఆయోగ్ సైలెన్స్ చూసి.. ఇప్పుడు కాకపోతే రేపటికైనా స్పెషల్ స్టేటస్ వస్తుందని ఆంధ్రా ప్రజలు ఆశపడ్డారు. కానీ.. ఇదే నీతిఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ చేసిన కామెంట్లు తెలుసుకుని ఇప్పుడు తీవ్రంగా నిరాశపడుతున్నారు.
రాష్ట్రాలకు సహాయం చేయాలన్న పేరుతో ప్రత్యేక హోదా ఇవ్వడం సరికాదంటూ… హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో.. సారస్వత్ సెలవిచ్చారు. ఏపీకి సహాయం చేయడంలో కేంద్రం అన్ని విధాలా ముందు నిలుస్తోందని చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ కూడా నిధుల విషయంలో ఏపీకి అండగా ఉంటోందన్నారు. ఇదే టైమ్ లో.. ప్రత్యేక హోదాకు సంబంధించి నీతి ఆయోగ్ ఇప్పటివరకూ ఎలాంటి రిపోర్ట్ కేంద్రానికి ఇవ్వలేదన్నారు. ఫ్యూచర్ లో ఇచ్చే విషయంపైనా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం.. ఇక కలే అన్న విషయం స్పష్టమవుతోంది.
ఇన్నాళ్లూ విషయం నీతి ఆయోగ్ కోర్టులో ఉందని కేంద్రం చెబుతూ వచ్చింది. ఇదే మాట చెబుతూ బాబు సర్కార్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సాక్షాత్తూ నీతి ఆయోగ్ సభ్యుడే.. ప్రత్యేక హోదా విషయం తేలే చాన్సే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
