తెలంగాణ లో శాసనసభ కోటాలోని శాసనమండలి సీట్ల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య బలాబలాలు ఈ ఎన్నికను ఏకగ్రీవంగా కాకుండా పోటీ దిశగా తీసుకెళ్తున్నాయి.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక సీటు దక్కాలి. ఎమ్మెల్యేల బలాన్ని బట్టి టీడీపీకి ఒక సీటు దక్కించుకొనే అవకాశం ఉంది.
అయితే టీడీపీని అన్ని విధాలుగానూ అణగదొక్కాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఐదో స్థానం కోసం కూడా తన అభ్యర్థిని పోటీలో నిలిపింది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బలాబలాల ప్రకారం చూసుకొంటే.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే కనీసం 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అయితే తెలుగుదేశం ఇప్పుడు అంత సీన్ లేదు.
ఆ పార్టీ తరపున గట్టిగా ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అయితే భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఐదు మంది ఎమ్మెల్యేలున్నారు. వీరు తెలుగుదేశంకు మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో టీడీపీ బలం 16 కు చేరుతుంది. ఇక కమ్యూనిస్టు పార్టీల ఖాతాలో రెండు సీట్లున్నాయి. వారిద్దరూ టీడీపీకి మద్దతునిస్తే బలం 18 కి చేరుతుంది!
అయినా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకోలేదు. ఒక ఎమ్మెల్యే బలం కలిసి వస్తే మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్సీ సీటును సొంతం చేసుకోగలదు. ఆ ఒక్క ఎమ్మెల్యే బలం కోసం తెలుగుదేశం వైకాపా వైపు ఆశగా చూస్తోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వైకాపా తరపున ఉన్నాడు. ఆయన గనుక మద్దతు పలికితే తెలుగుదేశం ఈ సీటును సొంతం చేసుకోగలదు. అయితే తెలుగుదేశం పార్టీకి వైకాపా ఉన్న శత్రుత్వం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో వైకాపా తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవనే అనుకోవాలి! మరి ఏం జరగుతుందో!
