ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తమ ప్రాణాలను తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం త్యాగం చేశారు. వారి ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం నడిచిందని చెప్పాలి. వారి అమరత్వం చిరస్మరణీయం.. 60 ఏళ్ల బానిస సంకెళ్లను తెంచుకొని స్వరాష్ట్రం సాధించుకున్న దానిలో అమరవీరులను గుర్తు చేసుకోవాల్సిందే. తెలంగాణ ఉద్యమం అంటే అమరవీరులను స్మరించాల్సిందే. రాష్ట్ర అవతరణ సంబరాల్లో అమరవీరులను పూజించాల్సిందే.
ఉద్యమ సమయంలో విద్యార్థులు, నాయకులు, ప్రజలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నారు. దాదాపు 1,450 మంది తొలి దశ, మలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. వారందరినీ స్మరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున అమరవీరుల స్థూపం నిర్మించాలని నిర్ణయించింది. అమరులను స్మరన కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
హుస్సేన్‌సాగర్ వద్ద భారీ స్థాయిలో అమరవీరుల స్థూపం నిర్మాణానికి డిజైన్‌లు పిలిచారు. ఒక డిజైన్‌ను ఫైనల్ చేశారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదించడంతో ఆ ఫోటోలను ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.స్మారక నిర్మాణం అద్భుతంగా ఉంది. దీపం రూపంలో డిజైన్ ఉండగా అమరులకు నిరంతరం నివాళి అర్పిస్తున్నట్లుగా ఉంది. స్మారకం దగ్గర సందర్శకుల కోసం పలు సౌకర్యాలు కల్పించనున్నారు. స్మారక నిర్మాణం వద్ద మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, సమావేశాల కోసం కన్వెన్షన్ హాల్, విజిటర్స్ కోసం ఓ రెస్టారెంట్ తదితర వసతులు కూడా ఉండనున్నాయి. స్మారకం డిజైన్ కట్టడంలో గ్రౌండ్ లెవల్ తో పాటు మూడు అంతస్తులు ఉండనున్నాయి. పైగా ఒక స్థూపం ఉండి ఆ స్థూపం పైన తెలంగాణ తల్లి విగ్రహం.. ఆ స్తంభం చుట్టూ కాగడాల రూపంలో జ్యోతులు ఉన్నాయి.
తెలంగాణ అమరుల స్మారకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణంతో హైదరాబాద్‌కు మరో అదనపు ఆకర్షణగా ఉండనుంది. ఇప్పటికే తెలంగాణ అమరవీరుల స్థూపం అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌లో ఉంది. ఉద్యమాలకు కేంద్రంగా అమరవీరుల స్థూపం ఉన్నది.
