రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదు అని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు… పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమే.నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారు. 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా బరోసా నిచ్చే హామీ . ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి నేతలు చేస్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి.. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పండి. నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావు ఎన్నికల హామీలు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని ఎక్స్ వేదికగా తెలిపారు షర్మిల.
