ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అసంతృప్తి సెగలు తగులుతూనె ఉన్నాయి. ఇప్పటికే పలు అసంతృప్తినేతలు పార్టీకి రాజీనామ చేయగా ఇప్పుడ మరి కొంత మంది అదే బాటలొ ఉన్నారు. మరికొంత మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రాకాశం జిల్లా టీడీపీనేత,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తన మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తమపై పెత్తనం చలాయించాలని చూడటం జిల్లా టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రు, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ పెత్తనం పెరగడంతో ఆయన పార్టీలో ఇమడలేకపోయారని వార్తలు వస్తున్నాయి. అందుకే గత కొంత కాలంగా పార్టీ అధిస్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పరిణామాల నేపథ్యంలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో టీడీపీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల చంద్రబాబు సర్కారు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా కాపు నేతలు టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. జ్యోతుల చంటిబాబు రాజీనామ చేయడం తూర్పుగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. త్వరలోనె ఆయన వైసీపీలో చేరె అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
