రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆసక్తి రేపిన సమీకరణాల మధ్యన ఆంధ్రప్రదేశ్ లో మూడు సీట్లకు గానూ నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపి నుండి రాజ్యసభకు నామినేషన్లు వేసిన ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. పార్టీలకున్న బలాల ప్రకారం టీడీపీకి రెండు, వైసీపీకీ ఒక సీటు దక్కుతుంది. మూడో సీటుకు టీడీపీ అభ్యర్తిని నెలబెడతారనే ప్రచారం బాగా సాగింది. కానీ చివరకు టీడీపీ రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.
టీడీపీ తరఫున అభ్యర్థుల ఎంపిక నిన్న పూర్తి కాగా, సోమవారం రోజున వారు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యత్వాన్ని టీడీపీ అధినేత పొడిగించారు. మరో సీటుకు ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు చంద్రబాబు. ఈ మేరకు వాళ్లు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు దక్కే సీటు కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసి నామినేషన్ వేయించింది. ఆయనతో పాటు ఆయన భార్య కూడా నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి నామినేషన్ వేశారు. ఓవరాల్ గా మూడు సీట్లకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు ప్రకటించారు.
నామినేషన్ దాఖలు ముగిసే సమయానికి మూడు స్ధానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయటంతో వారు ఏకగ్రీవమైనట్లే. కాకపోతే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయల్సుంటుంది.
