వెళుతున్నా వెళుతున్నా..వెళ్లాలని లేకున్నా దూరంగా వెళుతున్నా…అంటూ విరహ గీతాలు ఆలపిస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రిందట ఎంటరయ్యాను ఈ పోలటిక్సులోకి….అబ్బో చాలా చూశాం. చాలా చేశాం. ఇంక చాలు. ఈ రాజకీయ జీవితం. ఇక నేడో రేపో గుడ్ బై చెప్పేస్తా…అని చెప్పుకొచ్చారు. ఓహో ఇన్నాళ్లూ అనంతపురం రాజకీయాల్లో కింగ్ లా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, ఇక విశ్రాంతి తీసుకుంటున్నారు కాబోలు…అని ఆయన స్టేట్ మెంట్ విని పొరపడకండి. దాదాపు 4 దశాబ్దాలుగా అనంత జిల్లా పోలటిక్సులో కింగులా వెలిగిన ఈయన ఇక కింగ్ మేకర్ కావాలనుకుంటున్నారు. తను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి తన రాజకీయ వారసత్వం అప్పగించాలని ఈ పెద్దమనిషి డిసైడై పోయారు. తన అపార అనుభవాన్ని, పరిచయాలను ఇకపై కొడుకు రాజకీయ భవిష్యత్ ను 3 ఎన్నికలు 6 పదవులు అన్నట్టు తీర్చిదిద్దడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు జేసీ. ఇటీవల ప్రతిపక్షనేత వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతల మీద విరుచుకుపడ్డ దివాకర్ రెడ్డి, అప్పుడే తన మనసులోని మాటను బయట పెట్టారు. చంద్రబాబు తన కొడుకు లోకేశ్ కి మంత్రి పదవి ఇచ్చేశాడు. వేల కోట్ల ఆస్తులు ఇచ్చేశాడు… అని తెల్లారి లేచింది మొదలు ఈ వైఎస్ఆర్ సీపీ నాయకులు మొర్రోమని ఏడుస్తున్నారు. వీరికసలు బుర్రా బుద్ధీ ఏ మాత్రం లేవు. ఏ తండ్రి అయినా తన ఆస్తులు, రాజకీయ వారసత్వం తన కుమారుడికి ఇవ్వకపోతే, దారిన పోయిన దానయ్యకు ఇస్తాడా ? మీ వైకాపాలోని నాయకులు అలాగే ఇస్తున్నారా ? అని అనంతపురంలో జరిగిన బహిరంగసభలో జేసీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కొడుక్కి అన్నీ సమకూర్చడం తండ్రిగా అది బాధ్యత అని చెప్పుకొచ్చారు. రేపటి రోజున తాను కూడా తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి ఆస్తిపాస్తులతో పాటు రాజకీయ వారసత్వాన్ని అప్పగించేస్తానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే మాట చెప్పారు జేసీ.
అయితే అనేక మంది రాజకీయ నాయకుల్లా వారసుడికి రాజకీయ పగ్గాలు అప్పగించాలనుకోవడం సహజం. కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజం, ముక్కుసూటితనం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఇకపై తన కుమారుడికి ఎలాంటి డైరక్షన్ ఇస్తాడో చూడాలి. తాను అనేక సంవత్సరాలు కాంగ్రెస్ లోనే ఉన్నా, ఏనాడు తన స్వభావాన్ని దాచుకోలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ లో వైఎస్ సహా సోనియాగాంధీ నిర్ణయాలపైనా బహిరంగంగానే జేసీ విమర్శలకు దిగేవాడు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆ మహా తల్లి, ఆ ఇటలీ తల్లి…మా మాట వింటేనా…అంటూ సోనియాపై తన ఆగ్రహాన్ని ఆరున్నొక్క రాగంలో వ్యక్తం చేసేవారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అయినా మోడీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు చేసేవాడు. మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తూ ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నాడు. హోదా లేదు గీదా లేదు అంటూ తేల్చి పారేస్తున్నాడు. చంద్రబాబు కష్టజీవి, కర్మజీవి అంటూ…ఓ వైపు పొగుడుతూనే మరోవైపు చురకలు అంటిస్తున్నాడు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా పని చేశావ్. ఇంకా ఆశ తీరలేదా ? అని ప్రశ్నిస్తూనే..మీరు ఇంకా ఎదగాలి సార్, ప్రధాని స్థాయికి వెళ్లాలి అంటూ ఆశ పెడుతున్నాడు. ఇక జగన్ పైన అయితే జేసీ వీరంగమే ఆడేస్తున్నాడు. ఆ నా కొడుకు..అంటూ శృతిమించిన తిట్ల లాంటి పదజాలంతో రెచ్చిపోతున్నాడు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు ఇతర నాయకులను ఎప్పటికప్పుడు ఏకిపారేస్తూ జేసీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. జేసీ మైకు పట్టుకుంటే చాలు ఎవరో ఒక రాజకీయ నాయకుడి మీద కచ్చితంగా సెటైర్లు పడాల్సిందే. ఆయన ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేశారంటే రాయలసీమ యాసలో మాట్లాడే తీరును, హావభావాలను ఎంతసేపైనా చూడాల్సిందే. అయితే ఇప్పుడు జేసీ తనలాగే ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, సూటిగా సుత్తిలేకుండా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని కుమారుడు పవన్ రెడ్డికి పాఠాలు చెబుతాడా ? లేక ఏ రోటికాడ ఆ పాట పాడుతూ పదవులు కాపాడుకుంటూ, తద్వారా ఆస్తులను కాపాడుకోవాలని హితబోధ చేస్తాడా అన్నది చూడాలి. పైగా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన రాయలసీమలో కుమారుడికి ఎలాంటి రాజకీయ పాఠాలు బోధిస్తాడో ? తండ్రి పాఠాలను తనయుడు ఎలా అర్ధం చేసుకుంటాడో…? కాలమే చెబుతుంది.
