Monday, April 29, 2024
- Advertisement -

బాబుకు దినదినగండం స్టార్ట్…… 2014 టు 2019లో విభజన కంటే ఎక్కువ నష్టపోనున్న ఎపి

- Advertisement -

2014లో రాష్ట్ర విభజన పుణ్యమా అని సర్వం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నష్టపోవడం ఖాయమా? 2014 నుంచి 2019 వరకూ ఉన్న ఐదేళ్ళ కాలం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకూ అత్యంత కీలకం. అందుకే ఆంద్రప్రదేశ్ ఓటర్లు మోడీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్, టిడిపి భజన మీడియా కూడా ఐదేళ్ళలో ఆంద్రప్రదేశ్‌కి అన్నీ వచ్చేలా చేయాలంటే చంద్రబాబుకు ఓటేయాలని చెప్పి ప్రచారం చేసి జనాలను నమ్మించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ అంతా వంచనే. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైన పెడతానన్న బాబు…… ఓటేసిన ప్రజలను మోసం చేస్తూ రుణమాఫీ కమిటీపై మొదటి సంతకం చేసిన రోజునే బాబు పాలన ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైపోయింది. బాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోడు అన్న స్పష్టత వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీలకు కూడా చంద్రబాబే అడ్డుపడుతున్నాడు. హోదా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయడంలో చంద్రబాబు, భజన మీడియాలు వంద శాతం సక్సెస్ అయ్యారు. ఇక మిగతా హామీలన్నింటి విషయంలో కూడా బాబు తీరు అదే విధంగా సాగింది.

అయితే గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే నరేంద్రమోడీని బ్రతిమాలో, బామాలో కనీసం ప్యాకేజ్‌కి చట్టబద్ధత తెప్పించి పరువు నిలబెట్టుకోవాలన్న ఆశ టిడిపి నేతల్లో కనిపించింది. అయితే గుజరాత్‌లో బిజెపి తిరుగులేని విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బిజెపినే విజయం సాధించింది. మోడీ బలం ఇంకా పెరిగింది. ఇప్పటి వరకూ మోడీ నుంచి రాష్ట్రానికి ఒక్క ప్రయోజనాన్ని కూడా రాబట్టలేకపోయిన చంద్రబాబు ఇకపైన కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏం చేసినా ఇప్పుడే చేయాలి. అయితే ఓటుకు నోటుతో సహా ఎన్నో బలహీనతలున్న చంద్రబాబు…. ఇప్పుడు ఇంకా బలం పెంచుకున్న మోడీని కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా లేడు. చాలా కాలం నుంచీ చంద్రబాబుకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు మోడీ. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తన వ్యక్తిగత స్వార్థం కోసం పూర్తిగా మోడీకి సాగిలపడిపోయాడు. ఆ రకంగా విభజనతో సర్వం కోల్పోయిన ఆంద్రప్రదేశ్‌కి ఎంతో కీలకమైన ఈ ఐదేళ్ళ కాలంలో ఎపికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కకుండా చేస్తూ తీరని ద్రోహం చేస్తున్నాడు బాబు. 2019లోపు విభజన చట్టంలో ఉన్న కేంద్ర హామీలు ఏవీ అమలు కాకపోతే….రాజధాని నిధులు రాబట్టలేకపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల నుంచి రాబట్టడం చాలా చాలా కష్టమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్న…రాష్ర్టానికి ఒక్క ప్రయోజనం కూడా కల్పించలేకపోతున్న బాబు….ఇకనైనా మోడీ ప్రభుత్వం నుంచి బయటికి వస్తాడా? భాగస్వామిగా ఉండి సాధించలేకపోయినవాటిని పోరాడి సాధించే ప్రయత్నం చేస్తాడా?

ఆ ఛాన్సేలేదు. ఓటుకు నోటు, రాజధాని భూముల వ్యవహారంతో పాటు ఎన్నో అవినీతి కేసుల పుణ్యమాని చంద్రబాబుకు మోడీ దగ్గర సాగిలపడడం తప్పదు, ఆ రకంగా తన వ్యక్తిగత స్వార్థం కోసం అత్యంత అనుభవజ్ఙుడినని చెప్పుకునే చంద్రబాబు ఎంతో కీలకమైన ఐదేళ్ళ కాలంటో ఎపికి ఏమీ చేయలేని నేతగా మిగిలిపోనున్నాడు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎందుకు విభజించరు డిమాండ్ చేస్తూ లేఖలు రాసి, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలతో కుమ్మక్కై విభజన సమయంలో సీమాంధ్రకు అన్యాయం చేసిన చంద్రబాబు విభజన తర్వాత అత్యంత కీలకమైన ఐదేళ్ళ కాలంలోనూ అంతే అన్యాయం చేశాడన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -