విభజన నాటి హామీలు ఏవీ బాబు చెప్తున్న పద్దతిలో అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా తనకు, తన జనాలకు ఉపయోగపడేలా మాత్రం కేంద్రం ఆయా హామీలు అమలు చేయాలన్నది చంద్రబాబు పట్టుదల. నిధులు ఇస్తూ ఉండాలి……ఖర్చులు అడగకూడదు. రైల్వే జోన్ విజయవాడకు ఇవ్వాలి. పోలవరం, రాజధాని నిర్మాణ నిధులు భూరిగా ఇవ్వాలి. హోదా అయితే బాబు అండ్ బ్యాచ్‌కి ఏం ఉపయోగం? భారీగా పరిశ్రమలు వస్తాయి. రాయితీలు వస్తాయి.. ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ బాబుకు మిగిలేది ఏం ఉంటుంది? అదే ప్యాకేజ్ అయితే పండగ. అది కూడా లెక్కలు అడగకుండా ప్యాకేజీ ఇస్తే ఎంతకైనా తెగబడొచ్చు అన్నది బాబు బ్రహ్మాండమైన ఐడియా. అయితే అన్నీ తెలిసిన కేంద్రం ప్రతిసారీ బాబు చెప్పినట్టుగా ఆడడానికి రెడీగా లేదు. ఇప్పటికే నాలుగేళ్ళలో రికార్డ్ స్థాయిలో 2లక్షల కోట్లు అప్పులు చేశాడు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ ఒన్ రాష్ట్రంగా నిలిపాడు. ఈ కారణాల రీత్యా బాబు చెప్పినట్టుగా ఆడడానికి కేంద్రం సిద్ధంగా లేదు.
అయితే చంద్రబాబు మాత్రం నెపం అంతా వైఎస్ జగన్‌పై వేయడానికి నానా పాట్లూ పడుతున్నాడు. ‘కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా చిప్ప చూపిస్తున్నా……ఇంత జరుగుతున్నా బిజెపితో అంటకాగడానికి వైకాపా ఎదురు చూస్తోందని తాజాగా విమర్శించాడు చంద్రబాబు. అది కూడా ఆంధ్రజ్యోతి లీకేజీల ద్వారానే సుమా. అయితే ‘ఇంత జరుగుతున్నా……’ ఇంకా బిజెపితో చంద్రబాబు ఎందుకు పొత్తుకొనసాగిస్తున్నాడు అన్న ప్రశ్నకు బాబు సమాధానం చెప్పడు. కేంద్రంలో ఇంకా టిడిపి మంత్రులు కొనసాగుతున్నారు అంటే సమాధానం ఉండదు. బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకులేదు అని ఢిల్లీ వేదికగా అన్న మేకాపాటిలాంటి వైకాపా ఎంపీల మాటలు బాబుకు వినిపించవు. మొన్నటి వరకూ ఎన్నికలకు ముందే బిజెపితో వైకాపా పొత్తు అన్నారు. అది సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పుడు ఎన్నికలు అవగానే పొత్తు పెట్టుకుంటారని ఆరోపిస్తున్నాడు. ఆ రకమైన ప్రచారంతో 2019 ఎన్నికల్లో జగన్‌కి నష్టం చేయాలన్నది బాబు ప్లాన్.
కాకపోతే 2014లోలాగానే మరోసారి జనాలు మోసపోతారా? పోరాటం అంటూ చంద్రబాబు ఆడుతున్న నాటకాలు వాళ్ళకు తెలియవా? ఇంత జరుగుతున్నా బాబు ఇంకా బిజెపితో కలిసి సాగుతున్నాడని……మోడీ కేబినెట్‌లో టిడిపి మంత్రులు ఉన్నారన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? ఏంటో చంద్రబాబు……..జగన్‌ని కార్నర్ చేయడానికి మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు కానీ ఆయనే అడ్డంగా బుక్కవుతున్న విషయం మాత్రం గమనించలేకపోతున్నాడు.
