గెలుస్తామనే నమ్మకం లేక, ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఆశతోనే తాము ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. సాక్షాత్తూ బీజేపీ నేత చేసిన ఈ వాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రజల ఆశలను, కలలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఇప్పటికైనా అంగీకరించారని రాహుల్ గాంధీ గడ్కరీకి ట్వీట్ చేశారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో ప్రముఖ టీవీ చానెల్ ‘కలర్స్’లో ‘అసల్ పవానే- ఇర్సల్ నమూనే’ అనే రియాలిటీ షో ప్రసారమైంది. ఈ రియాలిటీ షో రెండు భాగాలుగా కలర్స్ టీవీ చానెల్ లో ప్రసారమైంది. ‘రాజకీయాలు సినిమా కలిసిన వేళ’ పేరుతో ఫస్ట్ పార్ట్. ‘నానా-నితిన్ మధ్య చమత్కారం’ పేరుతో రెండో పార్ట్ ప్రసారం చేశారు. అందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్‌తో కలిసి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆ షో సందర్భంగా గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నరేంద్రమోడీ, అమిత్ షా సహా దేశవ్యాప్తంగా బీజేపీని, ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేశాయి.
బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని, అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ప్రజలు నమ్మేలా చేశామని ఎలాంటి దాపరికం లేకుండా గడ్కరీ చెప్పేశారు. బీజేపీ ఇచ్చిన హామీలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారికి అలాంటి ఆశలు కల్పించింది తామేనని అంగీకరించారు. కానీ ప్రజల కలలు, ఆశలను నెరవేర్చే ప్రయత్నమే జరగలేదని గడ్కరీ అంగీకరించటం విశేషం. అధికారంలోకి వస్తామన్న నమ్మకం మాకు నాడు లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహాలిచ్చారు. మేం అదే చేశాం. ఇప్పుడు అధికారం దక్కించుకున్నాం. దీంతో మేమిచ్చిన హామీలను ప్రజలు మాకు గుర్తు చేస్తున్నారు. వాటిపై నిలదీస్తుంటే మేం నవ్వి వెళ్లిపోతున్నాం’’…అంటూ గడ్కరీ అసలు విషయాన్ని చాలా తేలికగా చెప్పేశారు. ఒక వేళ అధికారంలోకి రాకపోయి ఉంటే, హామీల ప్రశ్నే ఉండదు కదా ! అందుకే అసాధ్యమని తెలిసినా అలాంటి హామీలిచ్చేశామని చెప్పారు. కానీ ఊహించని రీతిలో ప్రజలు అధికారం కట్టబెట్టడంతో అసలు సమస్య వచ్చిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని బీజేపీ సర్కార్ గురించి అని, కొందరు బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. కానీ కేంద్రమంత్రి హోదాలో ఉండి మహారాష్ట్ర ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడతారు ? కేంద్రమంత్రిహోదాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైనే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. మోసం చేసినందుకు ఇప్పటికైనా ప్రజలకు మోడీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
