బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రస్థాయిలో అన్యాయం జరిగింది. చంద్రబాబు, పచ్చ మీడియా, పవన్ కళ్యాణ్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన రుద్దిన నరేంద్రమోడీ చిప్ప చేతికిచ్చాడు. నిజానికి 2014నుంచీ కూడా మోడీ చేస్తోంది అదే. కాకపోతే బాబు వ్యక్తిగత కేసులు, స్వార్థ ప్రయోజనాల కోసమా అని హోదాతో సహా అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడిక ఎన్నికల ఏడాది వచ్చేయడంతో ప్రజల ఆగ్రహాన్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఓ వైపు పచ్చ మీడియా అంతా కూడా మోడీపై రంకెలేస్తున్న బాబు, ఆగ్రహంతో ఊగిపోతున్న బాబు అంటూ పిచ్చి పిచ్చిగా పచ్చ కథలు రాసుకుంటూ పోతూ ఉంటే అదే టైంలో చంద్రబాబుగారు ఏం చేస్తున్నారో తెలుసా? బడ్జెట్ తర్వాత టిడిపి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో….ప్రజలకు వైకాపా ఎక్కడ బలంగా కనపడుతుందో అని చెప్పి వైకాపా నుంచి ఒక ఎమ్మెల్యేను ఫిరాయింపచేసి వైకాపా బలహీనపడింది అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
బాబుగారి జమానాలో పోలవరంతో సహా చాలా కాంట్రాక్టులు దక్కించుకున్న టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు ఈ బేరానికి బాబు తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. వైకాపా ఎమ్మెల్యే ముస్తఫాకు ఏం చెప్పాడో ఏమో కానీ మొత్తానికి బాబు దగ్గరకు తీసుకుపోయాడు. ముస్తఫాతో చంద్రబాబు మంతనాలు చేశాడు. అయితే ఎక్కడ బెడిసికొట్టిందో తెలియదుగానీ బాబుతో చర్చల పర్వం అయిపోయాక వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం టిడిపిలో చేరే ప్రసక్తేలేదని కరాఖండీగా చెప్పేశాడు.
బడ్జెట్‌లో అన్యాయం జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలా అని బాబు ఆలోచిస్తున్నాడు అన్న పచ్చ మీడియా కథలన్నీ హంబక్ అని బాబు మాత్రం ఎంచక్కా ఫిరాయింపుల రాజకీయం చేస్తున్నాడని చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రకంగా వ్రతం చెడగొట్టుకున్నాడు చంద్రబాబు. అయితే ఫలితం కూడా ఇంకా దిమ్మతిరిగేలే చేసింది. కాకపోతే అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబునాయుడు…….అత్యంత కీలక సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా ఒక ఎమ్మెల్యేను పార్టీ ఫిరాయించే విషయం కోసం తాపత్రయపడడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్తుగొలుపుతోందనడంలో సందేహం లేదు.
