గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. నేతల్లో బాబు భరోసా నింపుతున్నా ఆయనను ఎవరూ నమ్మడంలేదు. ఆపరేషన్ కమలం ప్రభావంతో.. రాజ్యసభ సభ్యులు, చంద్రబాబుకు సన్నిహితులైన సుజనా చౌదరి, సీఎం రమేశ్ బీజేపీ గూటికి చేరారు. మిగిలిన నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతుండగా.. ఇప్పుడు కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు.చాలా మంది కాపు నేతలు టీడీపీకి దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, టీడీపీ మాజీ ఎమ్మేల్యే తోట త్రిమూర్తులు పార్టీని వీడేందకు నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు సమావేశానికి సైతం త్రిమూర్తులు డుమ్మా కొట్టడంతో… ఆయన పార్టీని వీడటం దాదాపు ఖాయమనే వార్తలు మొదలయ్యాయి. తోట త్రిమూర్తులు వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని… వైసీపీలో చేరిన ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఇప్పటికే ఆయనకు స్పష్టత కూడా వచ్చిందని తెలుస్తోంది.
ఆయనకు వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని జగన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. త్రిమూర్తులుతోపాటు ఆయనతో టచ్‌లో ఉన్న కాపు నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉంది.తూర్పు గోదావరి జిల్లా కాపు నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తోట త్రిమూర్తులు… ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్‌తోనూ చర్చలు జరిపారని టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్ నుంచి హామీ ఉండటం వల్లే ఆయన చంద్రబాబు సమావేశానికి కూడా వెళ్లడానికి నిరాకరించారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే కీలకమైన కాపు నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న వైసీపీ… ఈ క్రమంలోనే తోట త్రిమూర్తులపై కన్నేసిందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించిన వైసీపీ… వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఇక్కడ తమ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
