టీడీపీకీ చెందిన నలుగురు రాజ్యసభ్యులు భాజాపా తీర్థం పుచ్చుకోవడం రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. బీజేపీలో తమను విలీనం చేయాలంటూ నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు నిన్న లేఖ ఇచ్చారు. టీడీపీని బీజేపీలో విలీనం చేసుకుంటామని బీజేపీ అధినేత అమిత్ షా కూడా లేఖ పంపించారు. ఈ లేఖలను పరిశీలించిన వెంకయ్య టీడీపీ పక్షాన్ని బీజేపీలోకి విలీన ప్రక్రియను పూర్తిచేశారు.
ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌రావులు శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్టీలో చేరిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన ఓఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్టీ మారిన ఎంపీలతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిసి భోజనం చేసే ఫోటో బయటపడింది. వైసీపీ నేతతో ఈ ఎంపీలు కలిసి భోజనం చేయడంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఎంపీలు పార్టీ మారడం వెనుక విజయసాయి హస్తం ఉందా అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేష్, సుజనా చౌదరిలపై విరుచుకు పడిన విజయసాయి ఇలా వారితో కలసి భోజనం చేసే పోటో ఇప్పుడు దుమారం రేపుతోంది.
లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరూ రెండు గంటలకుపైగా లోక్‌సభలోనే చర్చించుకున్నారు.ఈ ఫోటో పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ ఢిల్లీలో విందు ఇచ్చారట. ఆ విందుకు హాజరైన సమయంలో.. విజయసాయితో కలిసి నలుగురు ఎంపీలు భోజనం చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఫోటోపై విజయసాయిరెడ్డిగాని పార్టీ మారిన టీడీపీ ఎంపీలు గాని వివరన ఇవ్వకపోవడంతో ఇది నిజమనే భావన అందరిలో వ్యక్తం అవుతోంది. అదే నిజం అయితే రాజకీయాల్లో ఇంతకంటె అరాచకం ఇంకొకటి ఉండదు.
