Monday, May 13, 2024
- Advertisement -

పాత పార్టీల విధానాలపై జనసేన నిప్పులు…పవన్ కొత్తగా ఏం చేస్తారని సర్వత్రా ఆసక్తి

- Advertisement -

ఎవరు అవునన్నా కాదన్నా మన దేశంలో కులాల వారీగా రిజర్వేషన్ల అంశం తేనెతుట్టె లాంటిది. ఎంతో జాగ్రత్తగా డీల్ చేసినప్పటికీ రాజకీయ పార్టీలకు, నాయకులకు చాలా సందర్భాల్లో తిప్పలు తప్పడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ల అంశం రెండు వైపులా పదునున్న కత్తి. ఆ కత్తితో జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఎంతటి నాయకులకైనా నష్టం తప్పదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికల సందర్భంలో అయా పార్టీలు కులాల వారీగా రిజర్వేషన్ల హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక, వారికి నచ్చజెప్పలేక అవస్థలు పడటం కామన్ అయిపోయింది. రిజర్వేషన్లు కోరుతూ ఆయా కులాలు పార్టీలను డిమాండ్ చేయడం, కోర్టులకు వెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదోలా సర్ధి చెప్పడం, లేదంటే అసెంబ్లీలో తీర్మానం చేసేసి, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టడం చేస్తున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీం కోర్టు హెచ్చరిస్తోంది కనుక ఎటూ తేలక ఈ రిజర్వేషన్ల అంశం కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్యమాలు ఉద్ధృతమై ఆయా సామాజిక వర్గాల్లోని కొందరి ఆత్మహత్యలకూ దారి తీస్తున్నాయి. ప్రభుత్వాలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.

తెలంగాణ విషయానికి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం, అసెంబ్లీలో తీర్మానం చేసేసి, యథావిథిగా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసింది. దీనిపై మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం అని తెలంగాణ బీజేపీ మండిపడుతోంది. ఇక ఈ పంచాయతీ తేలాల్సింది కేంద్రంలోనే. ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఇదే సూత్రాన్ని అవలంభించింది. ఏడాది క్రితమే కాపుల రిజర్వేషన్లు, బీసీల్లో చేర్చే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపేసింది. ఇక ఈ అంశం కూడా తమ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని టీడీపీ సర్కార్ చెప్పేసింది. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని దాపరికాలు లేకుండా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు తేల్చి చెప్పేశారు. రిజర్వేషన్లు కల్పిస్తాను, బీసీల్లో చేరుస్తాను అని చంద్రబాబు లాగా నేను హామీలిచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేయను. కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కేంద్రప్రభుత్వ పరిధిలో ఉంది. కనుక నేను అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ కాపు కమిషన్ ద్వారా ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన నిధులకు రెట్టింపు నిధులు మంజూరు చేస్తానని చెబుతున్నాను. అంటూ జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆయనకు కొంత నష్టం కలిగించి ఉండవచ్చు. ఓ రాజకీయ నాయకుడిగా, ఎన్నికల ఏడాదిలో ఇలాంటి ప్రకటన చేయడం సాహసమే. జగన్ లాలూచీ లేకుండా, నికార్సుగా, స్పష్టమైన ఆలోచనతో, ఓ లక్ష్యంతో కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేసినా, అది మిస్ ఫైర్ అయిందని వైఎస్ఆర్ సీపీలోని కాపు నేతలు బాధ పడుతున్నారు. అసలు ఆ అంశం ఇప్పుడు అనసరంగా మాట్లాడారని, ఎన్నికల వరకూ డ్రాగ్ చేసి తర్వాత ఏదో చెబితే సరిపోయేది కదా అని లాభనష్టాల భేరీజులో తలమునకలైపోయారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వైఎస్ఆర్ సీపీ రెండూ రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల అంశం వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి, ఓట్లు పంట పండించుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరించి, కులాల మధ్య కుంపటి రాజేస్తున్నారని పవన్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఏడాదికో మాట చెబుతూ, యూ టర్న్ తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వైఎస్ఆర్ సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆటాడుతున్నాయి తప్ప, ప్రజల మీద ప్రేమ లేదని పవన్ నిష్ఠూరమాడారు. ఈ నేపథ్యంలో జనసేన విధివిధానాలు, మ్యానిఫెస్టో తో పాటు రిజర్వేషన్ల అంశంపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలిసారి పవన్ అధ్యక్షతన హైదరాబాద్ మాదూపూర్ లోని పార్టీ ఆఫీస్ లో నేడు చర్చించనుంది. రిజర్వేషన్ల అంశంపై అధ్యయనానికి నిపుణులతో చర్చించేందుకు కమిటీ నిర్ణయించింది. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా హామీలివ్వటం తప్పని మండిపడింది. రిజర్వేషన్ల అమలుపై ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తప్పుడు నిర్ణయాల వల్లే వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు పెరిగే పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని పవన్ మండిపడ్డారు. రిజర్వేషన్లపై తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిపేందుకు న్యాయ, రాజ్యాంగ నిపుణులు, వివిధ వర్గాల మేధావులు, నిపుణులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. సీనియర్ పార్టీలు, నాయకుల విధివిధానాలను తప్పు పడుతూ, తీవ్రంగా మండిపడుతున్న పవన్ పార్టీ ఏం నిర్ణయాలు ప్రకటిస్తుందో ? ఏ విధానాలు సూచిస్తుందో చూడాలి మరి. ఈయనైనా సరికొత్త విధానంతో ముందుకువస్తే అందరికీ మంచిదే కదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -