- Advertisement -

ప్రచారానికి దూరంగా…. టీడీపీ అభ్యర్ధులు

- Advertisement -

జాతీయ స్థాయి సర్వేలన్నీ రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమన్నట్లుగా ఫలితాలు వెల్లడిస్తుండటం, తమ ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ప్రచార కార్యక్రమాలను ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని టిడిపి కార్యాలయానికి సమాచారం అందుతోంది. రాష్ట్రంలోని ప్రచార శైలిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన అధికార పార్టీకి తమ పార్టీ నుంచే షాక్ తగిలే సమాచారం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్ధులు, దాదాపు 8 చోట్ల లోకసభ అభ్యర్ధులు ఎన్నికలను చాలా తేలికగా తీసిపారేస్తున్నారట. తాము ఎలాగో గెలిచే పరిస్థితి లేదని, ఇప్పుడు ఎంత శ్రమపడ్డా లాభం లేదని భావించి రోజు మొత్తం మీద రెండు మూడు గంటలకు మించి తిరగడం లేదట. అనంతపురం జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు ఎండ వంకతో కేవలం రాత్రిళ్లు మాత్రమే ప్రచారం చేస్తున్నారని, ఇలాగైతే ఎన్నికలు ఎలా అంటూ అక్కడి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ పట్టణంలో మరో నాయకుడైతే అసలు కారులోంచి దిగకుండానే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని , కారులో వెళ్లలేని ప్రాంతాలను అసలు పట్టించుకోవడం లేదని టిడిపి కార్యాలయానికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో సైతం అభ్యర్ధులు సీరియస్ గా పని చేయడం లేదని అంటున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ని అభ్యర్ధులు మరింత సీరియస్ గా పనిచేయకుంటే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుందని అందులో ఉన్నట్లుగా చెపుతున్నారు. మరికొంత మంది ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజనం లేదనే అభిప్రాయంతో మిన్నకుంటున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో, పార్టీ తరపున సమన్వయం కోసం,పోటీలోలేని సీనియర్ నాయకులను ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఛార్జిలుగా నియమించడమనే పార్టీ సంప్రదాయాన్ని ఈసారి అమలు చేయకపోవడంతోనే ఈ ఇబ్బంది అనే భావన కూడా పార్టీలో వ్యక్తం అవుతోంది. పార్టీ తరపున కేవలం చంద్రబాబు, ఆయనకు నచ్చిన ఇతర రాష్ట్రాల నాయకులు తప్ప మిగిలిన సీనియర్లు ఎవరూ ప్రచారం చేయడం లేదు. చాలా మంది సీనియర్లు కూడా తమ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్న నేపథ్యంలో, ఎక్కువ సమయం తమ నియోజకవర్గంపైనై దృష్టి సారించక తప్పని స్థితి ఉంది. అంగబలం, అర్ధబలం ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ప్రచారం సరిగా జరగని తీరును గమనించిన చంద్రబాబు ఇకపై ప్రతిరోజూ వీటిని కూడా సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన రోజువారీ షెడ్యూల్ లో ఈ మేరకు మార్పులు చేయాలని కూడా ఆదేశించినట్లుగా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -