Tuesday, May 7, 2024
- Advertisement -

వైఎస్ అవినీతి అంటూ కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌ని, రాష్ట్రపతిని బాబు కలవలేదా? సాయి వ్యూహాల భయంతోనే రచ్చ

- Advertisement -

నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా గురించి జగన్ మొత్తుకుంటూ ఉన్నా పట్టించుకోని చంద్రబాబుకు సడన్‌గా ఎన్నికల ఏడాదిలో జ్ఙానోదయమైంది. ఇక ఆ తర్వాత నుంచీ జనాలకు బ్రహ్మాండమైన సినిమా చూపిస్తున్నాడు. మోడీ ప్రభుత్వం కూలడమే తరువాయి…..అదీ బాబు సత్తా అని చెప్పి తన భజన మీడియా చేత గొప్పగా ప్రచారం చేయించుకుంటున్నాడు. అంతటితో తృప్తి పడని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం చేసిన మోడీతో జగన్ జతకడుతున్నాడని అబద్ధపు ప్రచారానికి తెరలేపాడు. గట్టిగా నాలుగు నెలల క్రితం వరకూ కూడా మోడీ ప్రభుత్వం ఎపికి అద్భుతంగా సాయం చేస్తోంది అని పొగడ్తల వర్షం కురిపించిన చంద్రబాబు, హోదా వేస్ట్…….ప్యాకేజ్ బెస్ట్ అని చెప్పిన చంద్రబాబు సరిగ్గా ఎన్నికల ఏడాదిలో జ్ఙానోదయం పొందడం వెనక 2019ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేయాలన్న వ్యూహం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇక్కడ జగన్‌ని మోడీతో ముడిపెట్టి రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం బూమరాంగ్ అవుతోంది. అసలు అంతటి చెడ్డవాడైన మోడీతో నాలుగేళ్ళుగా చంద్రబాబు ఎందుకు కలిసున్నట్టు అనే విషయం పక్కనపెడితే విజయసాయిరెడ్డి తరచుగా మోడీని కలవడాన్ని చంద్రబాబు తప్పుబట్టడం మాత్రం ఆశ్ఛర్యంగా అనిపిస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే చంద్రబాబు…..వైఎస్ అవినీతి అంటూ కాంగ్రెస్ ప్రధానమంత్రి, అప్పటి రాష్ట్రపతులను కలవలేదా? జాతీయ స్థాయిలో వైఎస్‌పై విష ప్రచారం చేయలేదా? అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు అవినీతి గురించి మోడీకి సాక్ష్యాలు ఇస్తూ ఉంటే తప్పేంటి? అయినా నిప్పు అని చెప్పుకుంటూ ఉండే చంద్రబాబుకు అంత భయం ఎందుకు? టిడిపి ఎంపిలలాగే వైకాపా ఎంపిలు కూడా పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే టిడిపి ఎంపిలకంటే ముందు నుంచే వైకాపా ఎంపిలు ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మోడీకి వ్యతిరేకంగా ముందుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది కూడా వైఎస్ జగనే. జగన్‌ని అవిశ్వాస తీర్మానాన్ని ఎద్దేవా చేసిన చంద్రబాబు…..ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి టిడిపి చేత కూడా అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. ఇక మోడీపై పోరాటంలో జగన్‌కంటే ఎక్కువగా బాబు చేసింది ఏంటి?

అయితే ఢిల్లీ స్థాయిలో ఉన్న పచ్చ మీడియా జర్నలిస్టులు మాత్రం చంద్రబాబు ఆగ్రహం వెనకాల అసలు విషయాల గురించి చెప్పేస్తున్నారు. అకౌంట్స్ విషయంలో నాలెడ్జ్ ఉన్న విజయసాయి చంద్రబాబు, లోకేష్‌ల అవినీతికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాడట. ఆ ఆధారాలను ఎప్పటికప్పుడు మోడీకి అందచేస్తున్నాడట. సోనియాతో కుమ్మక్కయి జగన్‌ని చంద్రబాబు ఇరికించాడన్నది నిజం. ఇప్పుడు జగన్ కూడా ఇంచుమించుగా అదే వ్యూహం అనుసరిస్తున్నాడు. సోనియాకు అప్పట్లో జగన్ శతృవు అయినట్టుగానే ఇప్పుడు చంద్రబాబు కూడా మోడీకి శతృవు అయ్యాడు. దీనిని అవకాశంగా తీసుకున్న వైకాపా వ్యూహకర్తలు చంద్రబాబు అవినీతి గురించి మోడీకి పూర్తి సాక్ష్యాధారాలతో వివరాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇదే చంద్రబాబులో ఆందోళన పెంచుతోందట. అందుకే విజయసాయిరెడ్డి ప్రధానిని కలిసినప్పుడల్లా చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ నేపథ్యంలోనే తనపైన సిబిఐ కేసులు కూడా ఖాయమని చంద్రబాబు భయపడుతున్నాడు. ఆ మొత్తం ఆందోళన నేపథ్యంలోనే మిగతా విషయాలు అన్నీ వదిలేసి విజయసాయిపై విరుచుకుపడుతున్నాడు చంద్రబాబు. అంతా బాగానే ఉంది గానీ తనపై ఎక్కడ కేసులు నమోదవుతాయో…..తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్న చంద్రబాబు……ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే విజయసాయిని విమర్శిస్తున్నానని చెప్పుకోవడం మాత్రం నవ్వు తెప్పిస్తోందని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులు చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -