Saturday, April 20, 2024
- Advertisement -

83లో ఎన్టీఆర్ స్టైల్‌లో సీట్ల ఎంపికలో జగన్ సరికొత్త వ్యూహం

- Advertisement -

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికంటే ఐదు శాతం ఓట్లకంటే ఎక్కువ తేడాతో వైకాపా విజయం సాధిస్తుందని జాతీయస్థాయి సర్వేలు స్పష్టంగా తేల్చేస్తున్నాయి. అయినప్పటికీ వైకాపా అభిమానుల్లో ఎక్కడో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. 2014 ఎన్నికల సమయంలో కూడా ఈ స్థాయి భారీ మార్జిన్‌లో తేడా లేకపోయినా ఎన్నికల ముందు వరకూ కూడా జగన్‌కే ఎక్కువ ప్రజాదరణ ఉన్నది అన్న మాట నిజం. కానీ విజయం మాత్రం చాలా తక్కువ మార్జిన్‌లో బాబును వరించింది. అందుకే ఇప్పుడు కూడా వైకాపా అభిమానుల్లో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. అయితే వైఎస్ జగన్ మాత్రం 2014 ఎన్నికల సమయంలో చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ చాకచక్యంగా ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాడు.2014 ఎన్నికల సమయంలో జగన్ చేసిన అనేకానేక పొరపాట్లలో సీట్ల ఎంపిక కూడా ఒకటి. వైఎస్‌పై అభిమానం, జగన్ ఫొటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు అనే స్థాయిలో అనేక స్థానాలకు సమర్థత లేనివాళ్ళను, పడక్కుర్చీలకు పరిమితమయ్యారు అని పేరు తెచ్చుకున్న నాయకులను ఎంపిక చేశాడు. పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిన ఆ నాయకులు వైఎస్‌లకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని కూడా ఓట్లుగా మల్చుకోలేకపోయారు.

అందుకే 2019 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 1983లో ఎన్టీఆర్ చేసినట్టుగా ఎక్కువ సంఖ్యలో యువకులకు సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అన్నింటికీ మించి సీనియర్స్ పోటీలో ఉన్న చోట కూడా నియోజకవర్గం మాత్రం పగలూ, రాత్రి అనే తేడా లేకుండా తిరుగుతూ ఉండే, ప్రజలతో మమేకమయ్యే యువనాయకులను నియోజకవర్గాలవారీగా నియమిస్తున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తాను అని చెప్తున్నాడు. యువకులకు, ఉత్సాహవంతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న జగన్ వ్యూహం విజయవంతమవుతోంది. ఇప్పటికే గుంటూరులో రజినీలాంటి మహిళా అభ్యర్థులు ప్రత్యర్థి, సీనియర్ నాయకుడైన పత్తిపాటి పుల్లారావుకు చెమటలు పట్టించే రేంజ్‌లో నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో యువ నాయకులందరూ కూడా చంద్రబాబు తప్పులను వివరించడంతో పాటు, వైకాపా అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలను కూడా వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం, హోదాతో సహా ఎన్నో విషయాల్లో ఆడిన డ్రామాలు, అవినీతి వ్యవహారాల పుణ్యమాని టిడిపి నాయకులు నేరుగా ప్రజలతో కలవలేని పరిస్థితుల నేపథ్యంలో వైకాపా యువనాయకులు ప్రజలతో పూర్తిగా మమేకమవుతూ ఉండడం వైకాపా బలాన్ని పెంచుతోంది. ఎన్నికల వరకూ, ఎన్నికల సమయంలో కూడా వైకాపా యువ నాయకులు ఇదే స్థాయిలో పని చేస్తే మాత్రం కచ్చితంగా వైకాపా విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న జగన్ వ్యూహం వైకాపాకు అత్యతం ప్రయోజనకరం అవుతుందనడంలో కూడా సందేహం లేదని రాజకీయ సర్వేల నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -