వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య తీసుకున్న నిర్ణయాల్లో చాలా కీలకమైనది ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ ఇంచార్జ్ లు, కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యే అభ్యర్ధుల మార్పు. గత నాలుగేళ్లుగా ఆయా బాధ్యతల్లో ఉన్నవారు కొందరైతే, వైఎస్ఆర్ సీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచీ ఉంటున్నవాళ్లు ఇంకొందరు. చిలకలూరి పేటలో మర్రి రాజశేఖర్, పార్వతీపురం నియోజకవర్గంలో జమ్మాన ప్రసన్న, విజయవాడలో వంగవీటి రాధా, కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, విశాఖ నార్త్, విశాఖ సౌత్, యలమంచిలి నియోజవర్గాల కో ఆర్డినేటర్స్, నెల్లూరులో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాయకరావుపేటలో గొల్ల బాబూరావు సహా ఇంకా పలువురు నేతలు వైఎస్ఆర్ సీపీలో ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్స్, ఇంచార్జులు, ఇలా వివిధ హోదాలో పని చేస్తున్నవారే. వీళ్ల స్థానంలో వైఎస్ జగన్ కొత్త వాళ్లకు అవకాశమిస్తున్నారు. కొందరిని ఇప్పటికే నియమించేశారు. మరికొన్ని మార్పులు చేర్పులు త్వరలో చేయబోతున్నారు.
దీనిపై పాత నాయకులు మండిపడుతున్నారు. పార్టీలో డబ్బులు ఉన్నవారికే టికెట్లు ఇస్తారా ? ఆయా నియోజకవర్గాలను బట్టి 15 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారే ఎమ్మెల్యే అభ్యర్ధులా ? మొదట నుంచీ జగన్ వెంటే నడిచాం. పార్టీ కష్టకాలంలో సేవలందించాం.. పార్టీ ఉనికి కోల్పోకుండా సొంత డబ్బులు ఖర్చు చేశాం. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాం. పార్టీ మనుగడ కోసం చాలా ఖర్చు పెట్టాం. రేయనక పగలక ఎంతో కష్టపడ్డాం. నియోకవర్గాల్లో పార్టీ జెండాలు కట్టాం. వైఎస్ విగ్రహాలు పెట్టాం. పాదయాత్ర సూచికగా స్తూపాలు ఏర్పాటు చేశాం. అధికార పార్టీ టీడీపీ పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొన్నాం. బెదిరింపులను భరించాం. టీడీపీ నేతలు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడకుండా, పార్టీలోనే ఉండి, అనేక విధాలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిిన మమ్మల్ని వాడుకుని వదిలేస్తారా ? అనేక రకాల వేధింపులను తట్టుకుని నిలబడిన మాకు, ఇప్పుడు వైఎస్ఆర్ సీపీలో స్థానం లేదా ? ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో మమ్మల్ని పార్టీ నుంచి గెంటేస్తారా ? ఇన్నాళ్లూ మా సేవలను వాడుకుని, ఇప్పుడు పొమ్మనక పొగబెడతారా ? అని ఆయా నేతలు నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ విధానాలను ఎండగడుతున్నారు. అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా డబ్బు మనిషి. అవకాశవాది అని ఆరోపిస్తూ శాపనార్ధాలు పెడుతున్నారు.
అయితే ఎక్కువ మంది ఆరోపిస్తున్నది జగన్ డబ్బులకే ప్రాధాన్యమిస్తున్నాడు. ఒక్కో నియోజకవర్గాన్ని బట్టి 15 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఖర్చు చేయగలిగితేనే ఉండండి. లేదంటే వేరే పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. రేసులో నుంచి తప్పుకోండి. ఇతరులకు అవకాశమివ్వండి..అని జగన్ సహా ఆ పార్టీలోని ముఖ్యనేతలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తాము అంత ఖర్చు చేయలేమని చెప్పడంతోనే తప్పిస్తున్నారని మండిపడుతున్నారు. వారి ఆరోపణలు నిజమే అయితే… ఓ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న ప్రతిపక్షనేతగా జగన్ నిర్ణయం హండ్రడ్ పర్సంట్ కరెక్టే. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓటమికి ప్రధాన కారణం పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఖర్చు పెట్టకపోవడమే. సానుభూతి ఉందిలే. పెద్దాయనా పెద్దాయనా పాట ఉందిలే. జగన్ సభలకు జనం వస్తున్నారు. మనమే గెలిచేస్తాం. ఎందుకు డబ్బులు ఖర్చు చేయడం అని, చాలామంది పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా దాచేసుకున్నారు. సొంత డబ్బు ఖర్చు చేయక, పార్టీ ఇచ్చింది ఖర్చు పెట్టక, తమ గొయ్యి తామే తవ్వుకుని, జగన్ ను కూడా ఆ గోతిలో పూడ్చేశారు. నాటి తప్పులను తెలుసుకున్న జగన్ మెల్లగా ఆ గోతిలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ధన ప్రవాహం ప్రభావితం చేయనుంది. నంద్యాల ఉప ఎన్నికే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరి కచ్చితంగా గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టేవారికే టికెట్లు ఇవ్వాలి. లేనివారికి ఇచ్చి మళ్లీ చేతులు కాల్చుకునే పనిలో జగన్ లేడు. అందుకే ఎవరు ఎన్నిరకాలుగా నిష్ఠూరమాడినా డబ్బులు ఖర్చు పెట్టేవారికే టికెట్లు అని కీలక నిర్ణయం తీసుకోవడం మంచిదే. కాకపోతే రేపు ఆ నిర్ణయం ఆచరణలో ఎంత విజయం సాధిస్తారో చూడాలి. అభ్యర్ధులు డబ్బులు ఖర్చు పెడతారో ? లేక దాచుకుని మళ్లీ ఓటమి పాలవుతారో ?
