Friday, March 29, 2024
- Advertisement -

జగన్ మంత్రి వర్గంలో ట్విస్ట్

- Advertisement -

కనీవినీఎరుగని బంపర్ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకుని ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గం కూర్పులో సొంత పార్టీ నేతలకే ట్విస్టులు ఇవ్వబోతున్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోబోతున్నారు ? 13 జిల్లాలు 25 జిల్లాలుగా మారనున్న నేపథ్యంలో ఏ జిల్లా నుంచి ఎవరికి అవకాశం రాబోతోంది ? సామాజికవర్గ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి ? విధేయతకు పెద్ద పీట వేస్తారా ? సీనియర్లకు చాన్స్ ఇస్తారా ? ఇలా అనేక ఊహాగానాల మధ్య ఫలానా ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఖరారు అయిపోయిందంటూ ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలా హల్చల్ చేస్తున్న పేర్లలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఒకటి. అయితే బొత్సకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు మాత్రం దీనిపై భిన్నంగా ఆలోచిస్తున్నారు. జగన్ ముందు నుంచీ చెబుతున్నట్లు 25 జిల్లాలు చేసినట్లయితే, విజయనగరం జిల్లాలో పార్వతీపురం కూడా జిల్లాగా ఏర్పడనుంది. ఆ లెక్కన ప్రస్తుత ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. అందులో ఒకటి బొత్స సత్యనారాయణ దక్కించుకోగా, ఇంకోటి ఎవరికి అనే చర్చ పార్టీతో పాటు సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ ఇక్కడే వైఎస్ జగన్ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టి, ఆ జిల్లా నుంచి మరో సీనియర్ నాయకుడు, మాజీ విప్, ఎన్టీఆర్ కాలం నుంచీ రాజకీయ జీవితంలో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పని చేసిన సీనియర్ నాయకుడు శంభంగి వెంకట చిన అప్పలనాయుడుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని జగన్ సహా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 1983, 1985, 1994లో శంభంగి విజయం సాధించారు. ఇప్పుడు 2019లో నాలుగోసారి మంత్రి సుజయకృష్ణరంగారావు మీద గెలిచారు. గతంలో కూడా రెండుసార్లు శంభంగి ఇద్దరు మంత్రులను ఓడించి విజయాన్ని దక్కించుకున్నారు. సౌమ్యుడు, విధేయుడిగా పేరుతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న శంభంగికే మంత్రి పదవి ఇస్తే పార్టీకి కలసి వస్తుందనే భావన ఇప్పుడు వైసీపీ పెద్దల్లో ఉంది.

బొత్స సత్యనారాయణకు మంత్రిపదవి ఎందుకు ఇవ్వాలి ? అనే కోణంలోనే ఆలోచిస్తున్న పార్టీ పెద్దలకు అనుకూలతలు కన్నా వ్యతిరేకతలే ఎక్కువ కనిపిస్తుండటంతో వాళ్లు శంభంగి వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ నమ్మదగ్గ వ్యక్తి కాడని వైసీపీలోనే కాదు, ఆయన సొంత జిల్లా విజయనగరంతో పాటు రాష్ట్ర రాజకీయాలను బాగా గమనించేవారు ఎవరైనా చెబుతారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాక, జగన్ పైనా, ఆయన కుటుంబీకులపైనా అత్యంత దారుణమైన విమర్శలు చేసిన నేతల్లో మొదటి వరుసలో బొత్స నిలిచారు. నాడు కాంగ్రెస్ మంత్రిగా, జగన్ తో పాటు ఆమె తల్లి విజయమ్మను టార్గెట్ చేసి, బొత్స చేసిన కామెంట్లు జగన్ కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేనివి, చంద్రబాబు సైతం చేయని స్థాయిలో బొత్స కామెంట్లు చేశారు. విజయమ్మ పెంపకంపైనా, జగన్ వ్యక్తిత్వంపైనా బొత్స చేసిన వ్యాఖ్యలతో నాడు విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. టీడీపీ ప్రధాన ప్రత్యర్ధి అయినా ఆ పార్టీ నేతలు కూడా వాడని పరుష పదజాలం బొత్సా వాడారని, పిల్లలను పెంచే తీరు ఇదేనా ? అంటూ బొత్స తన పెంపకాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని విజయమ్మ పలు ఇంటర్వ్యూల్లో నాడు కన్నీరు పెట్టుకున్నారు. ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం ఇంత నీచంగా కామెంట్ చేయాలా ? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాంలో తమ ఇంటికి వచ్చిన బొత్సకు స్వయంగా తానే భోజనం వడ్డించానని, ఆనాడు ఎంతో ప్రేమాభిమానాలు కురిపించిన బొత్స, వైఎస్ మరణం తర్వాత తమ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, ఇంత విషం చిమ్ముతారా ? ఇతడి కంటే టీడీపీ నేతలే నయం అని ఆమె సన్నిహితుల వద్దా తన గోడు వెళ్లబోసుకున్నారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో బొత్స వ్యవహరించిన తీరుతో విజయనగరంలో అతడి ఆస్తులపై ప్రజలు దాడి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు బొత్స కుటుంబం కనపడితే అంతుచూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు, బొత్స కుటుంబీకులను చిత్తుచిత్తుగా ఓడించారు. తనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బొత్స కుటుంబం కొన్నాళ్లు చడీ చప్పుడు లేకుండా తల దాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేనట్టేనని గ్రహించిన బొత్స మెల్లగా టీడీపీ, బీజేపీ వైపు అడుగులేశారు. కానీ అక్కడ లిక్కర్ డాన్ అంటూ చంద్రబాబు స్వాగతించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వైసీపీ తలుపు తట్టారు. జగన్ కు కూడా ఆ పరిస్థితుల్లో పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉండటంతో తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల సహా పార్టీలోని అనేకమంది నాయకులు వ్యతిరేకించినా బొత్సకు పార్టీలో స్థానం కల్పించారు. ఇక్కడ జగన్, బొత్స ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్లు చేతులు కలిపారు. అంతే తప్ప ఒకరి మీద ఒకరికి నమ్మకంతోనో గౌరవం అభిమానంతోనో కాదు. ముందు పార్టీ బలపడాలి. ఎలాగైనా అధికారంలోకి రావాలి. కనుక ఎవరు వచ్చినా కాదనకుండా చేర్చుకోవాలనే లక్ష్యంతోనే జగన్ నాడు బొత్సను చేరదీశారు. ఎవరినైనా చేర్చుకోండి కానీ బొత్సను మాత్రం వద్దంటూ విజయమ్మ, షర్మిల పట్టుబట్టినా, ముందు అధికారంలోకి మనం రానీ, తర్వాత సంగతి చూద్దామంటూ… వారిని మెల్లగా ఒప్పించి మరీ జగన్ నాడు బొత్సను పార్టీలో చేర్చుకున్నారు.

ఇప్పుడు జగన్ లక్ష్యం నెరవేరింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కష్టకాలంలో తన వెంట ఉన్నవారికే మంత్రిపదవులు, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సహా విజయమ్మ, విజయసాయిరెడ్డి ఇతర పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వైసీపీ కష్టకాలంలో బొత్స తమ వెంట లేరని, ఆయన కష్టకాలంలోనే వైసీపీలో చేరారని వాళ్లంతా గుర్తు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వారికి మంత్రిపదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన నాడు మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని అన్నీ వదిలేసి వైసీపీ వెంట నడిచారని, అలాంటి వారికే పదవులు ఇవ్వాలి కానీ, బొత్స లాంటి అవకాశవాదులకు వద్దని వైసీపీలో ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. పోనీ ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి బొత్స కష్టమే కారణమనుకోవడానికీ లేదని తేల్చి పారేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఎందుకంటే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్క చంద్రబాబు తప్ప మిగిలిన 13 సీట్లూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. సో రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం వల్లే నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ సాధ్యమైంది తప్ప, బొత్స సొంత జిల్లాలో ఆయన సాధించిన ఘనత ఏమీ లేదన్నది వైసీపీలోని సీనియర్ల వాదన. బొత్స గత రాజకీయ చరిత్ర చూసుకుంటే, ఆయన వైసీపీ నేతల పట్ల గతంలో వ్యవహరించిన తీరును గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాల్సిన పని లేదని, విజయమ్మ, షర్మిల సహా పలువురు జగన్, విజయసాయిరెడ్డికి గుర్తు చేస్తున్నారు.

బొత్సాకు మంత్రి పదవి ఇచ్చి, ప్రాధాన్యత పెంచినట్లయితే కచ్చితంగా వైసీపీలో రెండో పవర్ సెంటర్ ప్రారంభమవుతుందని, అది భవిష్యత్తులో పార్టీలో చీలికలకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని జగన్, విజయసాయిరెడ్డి, విజయమ్మ, షర్మిల సహా పలువురు పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అతడికి మంత్రి పదవి ఇవ్వకపోయినంత మాత్రాన చేయగలిగేది ఏమీ లేదని, అఖండ మెజార్టీతో గెలిచిన పార్టీకీ వచ్చే నష్టమేమీ ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కాపులకు అన్యాయం జరిగిందని బొత్స తన అనుకూల వర్గంతో పాటు, తమ సామాజిక వర్గానికి చెందిన రిపోర్టర్లతో వార్తలు ప్రచారం చేయించినా, దానికి అడ్డుకట్ట వేస్తూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఇతర నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటే సరిపోతుంది తప్ప బొత్సకు మాత్రం వద్దు. అనే వారి సంఖ్యే పార్టీలో పెరుగుతోంది. ఈ విషయాలను ముందే పసిగట్టిన బొత్స కూడా మీడియా మిత్రుల వద్ద కూడా చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోతున్నారు. తనకు మంత్రివర్గంలో చోటు ఖాయమని ఇన్నాళ్లూ తన సామాజికవర్గం రిపోర్టర్లతో దండిగా వార్తలు రాయిస్తూ, ప్రచారం చేయించుకున్న ఆయన ఇప్పుడు వారితో కూడా కనీసం ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడటం లేదు.

ఇక్కడ తెలంగాణలోని టీఆర్ఎస్ లో కీలక నాయకుడైన హరీశ్ రావుని కూడా కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన ఉదంతాన్నీ జగన్ పరిశీలించారు. కేసీఆర్ తర్వాత పార్టీలో నెంబర్ 2 ఎవరు ? కేసీఆర్ రాజకీయ వారసుడు హరీశ్ రావేనా ? అనే చర్చ నేపథ్యంలో, ఇప్పటికే పార్టీలో నెంబర్ టూ స్థానానికి ఎదిగి, మరో పవర్ పాయింట్ గా మారిన హరీశ్ రావు ఎప్పటికైనా పార్టీలో కొరకరానికొయ్యగా మారతాడని, పార్టీలో చీలికలకు కారణమవుతాడని గ్రహించిన కేసీఆర్ ఈ సారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ముందే పవర్ కట్ చేస్తే తర్వాత చిక్కులు తప్పుతాయని భావించే కేసీఆర్ హరీశ్ రావు ప్రాధాన్యత తగ్గించారు. అదే విధంగా ఇక్కడ బొత్సకు కూడా ముందే చెక్ పెట్టేస్తే తర్వాత తలనొప్పులు ఉండవని జగన్ అండ్ టీం భావిస్తోంది. మరీ అంతగా కాకపోతే మూడు నాలుగేళ్ల తర్వాత మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో భాగంగా బొత్సకు చాన్సు ఇవ్వవచ్చు కానీ, ప్రస్తుతానికి అవసరం లేదనే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా నుంచి ఎస్టీ కోటాలో రాజన్నదొర, పుష్పశ్రీవాణి పేర్లు పరిశీలనలో ఉండగా బీసీ కోటాలో శంభంగి వెంకట చిన అప్పలనాయుడు పేరు పరిశీలనలో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. శంభంగికి ఇప్పటికే విజయసాయిరెడ్డి నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో శంభంగి మరింత గట్టిగా ప్రయత్నిస్తే కచ్చితంగా మంత్రిపదవి దక్కించుకునే చాన్స్ ఉంది. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు చేస్తారో ? అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో లేదో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -