నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీ నేతల టార్గెట్ చంద్రబాబు. అందుకోసం ఏపీకి నిధులు ఇవ్వకుండా, ఏపీ అభివృద్ధికి సహకరించకుండా, ప్రత్యేకహదా ఇవ్వకుండా ప్రజలను హింసించే బదులు చంద్రబాబుని ఒకేసారి ఎన్‌కౌంటర్ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ? అని బీజేపీ నేతలను నటుడు శివాజీ నిలదీశారు. ఢిల్లీలో ఓ నలుగురు దుర్మార్గులు కూర్చుని ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల కుట్రల ఫలితమే ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో ఐటీ దాడులని శివాజీ ఆరోపించారు. వాటి ద్వారా టీడీపీ ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలనేదే బీజేపీ నేతల కుట్రని వివరించారు. చంద్రబాబుని రాజకీయం దెబ్బతీయాలని, ఏపీలో బీజేపీ పాగా వేయాలని కుట్రలు చేస్తున్నాయన్నది శివాజి ప్రధాన ఆరోపణ.
అయితే చంచ్రబాబుని ఎందుకు దెబ్బతీయాలని మోడీ చూస్తున్నారు ? బాబుని తొక్కేస్తే మోడీకి ఏంటి లాభం ? ఈ రెండు ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధానాలు రాజకీయ విశ్లేషకులు, ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వాజ్ పేయ్ హయాం నుంచి ఎన్డీఏలో కూటమిలో చంద్రబాబు కీలకనేత. ఢిల్లీ రాజకీయాల్లో నాడు చంద్రబాబు చక్రం తిప్పే సమయానికి గుజరాత్ రాజకీయాల్లో మోడీ ఓ సాదాసీదా నాయకుడు. వాజ్ పేయ్ కి చెప్పి అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయించడంతో సహా అనేక కీలక నిర్ణయాల్లో చంద్రబాబు ముఖ్యపాత్ర పోషించారు. అయితే కాలం వేగంగా కరిగిపోయింది. గత 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా టీడీపీ ఉంది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ మెజార్టీపై జాతీయ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. మోడీని ప్రధానిగా మైనార్టీ వర్గాలు, కొన్ని ఇతర పార్టీలు అంగీకరించకపోవచ్చని, బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ రాకపోతే మోడీ ప్రధాని కావడం కష్టమని ఆ కథనాల సారాంశం. ఎన్డీఏకి బొటాబొటీ మెజార్టీ వస్తే మోడీని ప్రధానిగా అంగీకరించకపోతే, ఎన్డీఏ నుంచి తర్వాత ప్రధాని రేసులో ఎవరున్నారు ? అని జాతీయ మీడియా విశ్లేషిస్తూ కథనాలు రాసింది. వాజ్ పేయ్ హయాం నుంచీ ఆ కూటమిలో నమ్మదగ్గ మిత్రుడు, అనుభవజ్ఞుడు, కష్టపడేతత్వం, రాజకీయచాణక్యం, జాతీయ అంశాలపై పట్టు, అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోగల నేర్పు ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు. అతడే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జాతీయ మీడియా తేల్చింది. గతంలోనే బాబుకు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా వదులుకున్నారు. ఈ సారి ఆ అవకాశం వస్తే వదులుకోకపోవచ్చనే విశ్లేషణలను, డిబేట్స్ బాగా జరిపాయి.
బీజేపీకి బొటాబొటీ మెజార్టీ వస్తే ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీల మద్దతు మోడీకి ఉండకపోవచ్చని ఆ కథనాల ప్రథాన సారాంశం. అలాంటి నేపథ్యంలో మోడీ తర్వాత కూటమి అభ్యర్ధిగా చంద్రబాబుకే అవకాశాలు ఎక్కువని అవి తేల్చి చెప్పాయి. కానీ బీజేపీకి, ఎన్డీఏకి అఖండ మెజార్టీ రావడంతో కథ మొత్తం మారిపోయింది. కానీ మోడీ, అమిత్ షా వెన్నులో వణుకుమాత్రం అలాగే ఉండిపోయింది. 2014లో సరే, 2019లో మళ్లీ అదే కథనాలు, విశ్లేషణలు వెలువడే చాన్స్ ఉంది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత, మోడీపై వ్యతిరకేత ఈ సారి గట్టిగా పని చేస్తాయి. ఆ నేపథ్యంలో మళ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రధాని రేసులో నిలుస్తారు. అందుకే మోడీ, జైట్లీ, అమిత్ షా కావాలనే కక్షగట్టి, బాబుని అవమానించి, ఏపీకి నిధులు నిరాకరించి, ప్రత్యేకహోదాని అటకెక్కించి, చంద్రబాబు తనంతట తానే కూటమి నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు ఐటీ దాడులుతో టీడీపీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్లకంటే దేశముదురు అయిన చంద్రబాబు అటు ఎన్డీఏకి కటీఫ్ చెబుతూనే ఇటు యూపీఏతో జట్టు కట్టారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏ సపోర్ట్ తో బాబు ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ అవకాశాలు ఉండటం వల్లనే ఏపీలో 25 ఎంపీ స్థానాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మరీ చంద్రబాబు గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఆయన ప్రధాని అయితే ఏపీ ప్రజలకు అంతకంటే కావలిసింది ఇంకేముంటుంది ? ఏపీ అభివృద్ధి పంచకళ్యాణిపై పరుగులు పెట్టడం ఖాయమే కదా.
