Saturday, April 27, 2024
- Advertisement -

జల్సాల్లో తెలుగు రాష్ట్రాలు… ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి మ‌ర‌ల్చ‌డానికి తిప్ప‌లు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఉత్స‌వాల జోరు కొన‌సాగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప‌క్క‌న‌బెడితే తెలంగాణ‌లో మాత్రం ఉత్స‌వాల మీద ఉత్స‌వాలు చేస్తూ ఉన్నారు. ఏడాదిలో నాలుగైదు క‌నీసం ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా చేస్తేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఉత్స‌వాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఈ ఉత్స‌వాలు త‌న వ్య‌క్తిగ‌తం కాగా కొన్నేమో రాష్ట్రం కోసమ‌ని.. ఏవేవో పేర్లు చెప్పేసి ఉత్స‌వాల‌ను మునుపెన్న‌డూ లేని విధంగా చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2, 2014ను అత్యంత ఆర్భాటంగా.. వైభ‌వంగా నిర్వ‌హించారు. ఆ రోజునే సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక ప్ర‌తి యేడు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు క‌నివినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హిస్తున్నారు.

అధికారం చేప‌ట్టిన తొలినాళ్ల‌లోనే మ‌హా చండీయాగం అంటూ ఓ నెల రోజులు ప‌రిపాల‌న వ‌దిలేసి త‌న వ్య‌క్తిగ‌త పూజ‌లు చేశారు. దీనికి దేశం నలుమూల‌ల నుంచి పీఠాధిప‌తులు, ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులంద‌ర్నీ ఆహ్వానించి పూజా కార్య‌క్ర‌మాలు కొన‌సాగించారు. దీనికి అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. కేసీఆర్ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం ప్ర‌జ్ఞాపూర్ వ‌ద్ద దాదాపు వంద ఎక‌రాల్లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించారు. ప‌రిపాల‌న యంత్రంగామంతా అక్క‌డే మునిగితేలింది.

తెలంగాణ‌లో ఉన్న‌న్ని పండుగ‌లు దేశంలో మ‌రే రాష్ట్రంలో ఉండ‌వేమో. ఇన్నాళ్లు స‌మైక పాల‌న‌లో క‌నుమ‌రుగైన తెలంగాణ పండుగ‌ల‌ను వెలికితీసి నిర్వ‌హిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ గొప్ప‌గా చెప్పుకుంటారు. ఆ త‌ర్వాత బోనాల పండుగ. ఈ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించి దీన్ని ఓ భారీ స్థాయి ఉత్స‌వంలా కొన‌సాగించారు. ఆ త‌ర్వాత బ‌తుక‌మ్మ పండుగ అని హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా అంగ‌రంగ వైభ‌వంగా వేడుక‌లు జ‌రిపారు. దీనికోసం ఎన్నో కోట్లు ఖ‌ర్చు పెట్టి ఉత్స‌వాలు ముగించారు.

పుష్క‌రాలు
ఇక వీటి త‌ర్వాత రెండు ప్ర‌ముఖ న‌దుల పుష్క‌రాలు వ‌చ్చాయి. దీనికి కూడా అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కోట్లు కుమ్మ‌రించేసి ప‌నులు చేసి పుష్క‌రాలు రాష్ట్ర ప్ర‌భుత్వ పండుగ‌గా చేశారు. గోదావ‌రి, కృష్ణ పుష్క‌రాలు ఏడాది గ్యాప్‌లో వ‌చ్చేశాయి. దీనికి దేశంలోని ప్ర‌ముఖ పీఠాధిప‌తుల‌ను పిలిపించి స్నానాలు చేయించేసి దానికోసం ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టి ఉత్స‌వాలు ముగించారు.
ప్ర‌తి ఏడాదిలో వ‌చ్చే పండుగ‌లు ఎలాగో ఉన్నాయి. బ‌తుక‌మ్మ‌, బోనాలు త‌దిత‌ర పండుగ‌లు కొన‌సాగుతూనే ఉంటాయి.

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న కూడా ఉత్స‌వంలా
ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి న‌రేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈయ‌న ప‌ర్య‌ట‌న‌ను ఓ ప‌క్షం రోజుల పాటు హంగుఆర్భాటాల‌తో కొన‌సాగించారు. మిష‌న్ భ‌గీర‌థ తొలిద‌శ ప్రారంభం, రెండు, మూడు ప్రాజెక్టుల ప్రారంభం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న బీజేపీ క‌న్నా టీఆర్ఎస్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. క్రెడిట్ గోస్ టూ తెలంగాణ ప్ర‌భుత్వం అని ప‌డింది.

దాని త‌ర్వాత ఓయూ వందేళ్ల ఉత్స‌వాలు. దీనిని కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిద్దామ‌ని వెళ్లారు. కానీ అభాసుపాల‌య్యారు. ఏర్పాట్ల‌యితే ఘ‌నంగా చేశారు. కానీ ఓయూ విద్యార్థుల‌కు భ‌య‌ప‌డి కేసీఆర్ మాట్లాడ‌లేద‌నే అభిప్రాయం స‌ద‌స్సుకు కొంచెం మ‌చ్చ తెచ్చింది. ఈ స‌భ‌కు అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ, దేశ‌విదేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఇది మూడు, నాలుగు రోజుల పాటు కొన‌సాగాయి.

ఇంకా ఇవాంకా ప‌ర్య‌ట‌న‌
ఆసియాలోనే తొలిసారిగా ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు భార‌త‌దేశంలోని హైద‌రాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సు కోసం ఓ నెల రోజుల చేసిన ఆర్బాటం, హంగులు ఏ కార్య‌క్ర‌మానికి చేయ‌లేదు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ కోసం ప‌రిత‌పించారు. హైద‌రాబాద్‌ను కాదుకాదు ఇవాంకా ప‌ర్య‌టించే ప్రాంతాలు ఎన్న‌డు లేని విధంగా స‌ర్వాంగ‌సుందరంగా ముస్తాబు చేసి వేడుక ముగించారు. ఇవాంకా మెప్పు కోసం పాటుప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి క్రెడిట్ పోతాద‌నుకుంటే సీఎం కేసీఆర్ ఖాతాలో ప‌డిపోయింది.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు
ఆ వెంట‌నే నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అంగ‌రంగ వైభ‌వంగా ఐదు రోజుల పాటు నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు దాదాపు రూ.60 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని టాక్‌. తెలుగు మ‌హాస‌భ‌లు అని చెప్పుకున్నా తెలంగాణ మ‌హాస‌భ‌లుగా అంద‌రూ భావించారు. ఎందుకంటే తెలుగు వారంద‌రినీ పిల‌వ‌లేదు. ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి క‌నీసం ఆహ్వానం ద‌క్క‌లేదు. క‌వులు, ర‌చ‌యిత‌ల‌ను స్వాగ‌తించ‌లేదు. ఇక తెలంగాణ‌లోనూ క‌వులు, క‌ళాకారుల‌కు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. త‌న మాట వినేవారిని అంద‌ల‌మెక్కించడంలో కేసీఆర్‌కు ఎవ‌రూ తీసిపోరు ఈ ఉత్స‌వాలు ముగిశాయి.

ఇక వీటి త‌ర్వాత భార‌త సైన్స్ కాంగ్రెస్ 2018 జ‌న‌వ‌రి 3-7 మ‌ధ్య ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఓయూలో నిర్వ‌హించ‌డంపై ప్ర‌భుత్వం సంశ‌యంలో ప‌డింది. ఎక్క‌డా అనేది తెలియ‌దు కానీ మొత్తానికి జ‌రుగుతాయి. దీనికి ఓ ప‌ది రోజులు కేటాయిస్తారు. ఆ త‌ర్వాత ఆసియాలోనే జ‌రిగే అతిపెద్ద జాత‌ర మేడారం స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌. ఈ జాత‌ర‌కు ఎలాగో నెల రోజులు కేటాయించాల్సిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పండుగ‌లు ఎలాగో వ‌స్తాయిగా. అవి కొన‌సాగుతాయి. ఆలోపు ఎన్నిక‌ల హ‌డావుడి వ‌చ్చేస్తుంది.

ఈ విధంగా ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డంలో పెద్ద రాజ‌కీయమే ఉంది. ఇలాంటి ఉత్స‌వాలతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లితే త‌మ స‌మ‌స్య‌లు మ‌ర‌చిపోయి త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతార‌ని కేసీఆర్ అంచ‌నా. త‌ద‌నుగుణంగా తాను వేసుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్తున్నాడు. ఆ విధంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఈ విధంగా ఉత్స‌వాలు కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడడానికి ఎప్పుడెప్పుడు అవ‌కాశం వ‌స్తుంద‌ని కాపు కాసి కూర్చున్నారు. కానీ వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు.

తెలంగాణ‌కు పోటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌డుస్తోంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డ‌మే పెద్ద హంగామా చేశాడు. ఆ త‌ర్వాత పుష్క‌రాలు వ‌చ్చాయి. రాజ‌మండ్రిలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ర‌చ్చ జ‌రిగింది. ఆ త‌ర్వాత అమ‌రావ‌తి శంకుస్థాప‌న అయితే వైభ‌వంగా నిర్వ‌హించారు. ప్ర‌ధాని మోదీని పిలిచి రిబ్బ‌న్ క‌ట్ చేయించాడు. కానీ ప్ర‌ధాని హామీలు ఏమీ ఇవ్వ‌క‌పోవ‌డంతో కొంచెం విమ‌ర్శ‌ల పాల‌య్యింది. ఆ త‌ర్వాత బీచ్ ఫెస్టివ‌ల్‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఇలా ఏవేవో పేర్లు పెట్టేసి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నాడు. కేసీఆర్‌ను చూసి చంద్ర‌బాబు నేర్చుకున్నారు. ఇద్ద‌రు గురుశిష్యుల ప‌రిపాల‌న ఒకే తీరున సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -