Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అదే…. ఆ ఒక్కటీ అలవడితే అధికారం ఖాయం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ చంద్రబాబుకంటే వైఎస్ జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ. వ్యక్తులుగా తీసుకుంటే మాత్రం వాళ్ళిద్దరిలో జగన్‌కే ఎక్కువ క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ఈ విషయం గత కొన్నేళ్ళుగా చంద్రబాబు, జగన్‌ల బహిరంగ సభలకు వస్తున్న జనాలను చూస్తున్న ఎవరైనా ఇట్టే చెప్పగలరు. ప్రజాదరణ విషయంలో చంద్రబాబుకంటే వైఎస్ రాజశేఖరరెడ్డిది కూడా పైచేయే. అయితే మేనిప్యులేషన్స్, మేనేజ్‌మెంట్ విషయంలో చంద్రబాబు ముందు వైఎస్‌లు ఇద్దరూ దిగదుడుపే. పాదయాత్రతో కనీవిని ఎరుగని స్థాయిలో ప్రజాదరణ పెరగడంతో వైఎస్ అయినా అధికారంలోకి వచ్చాడు కానీ లేకపోతే చంద్రబాబు మేనేజ్‌మెంట్ స్కిల్స్ ముందు నిలబడడం ఆషామాషీ కాదు. అలాగే జాతీయస్థాయిలోనూ, తెలుగు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల దశాబ్ధాలుగా ఉన్న అభిమానం కలిసొచ్చి వైఎస్ అధికారంలోకి రాగలిగాడు. జగన్‌కి ఇప్పుడు ఆ ప్లస్ పాయింట్ కూడా లేదు. మీడియాతో పాటు అన్ని వ్యవస్థలనూ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు చంద్రబాబు. న్యాయవ్యవస్థను చంద్రబాబు ఓ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడని ఇప్పటికే ఎంతోమంది న్యాయ వ్యవస్థలో పనిచేసిన మేధావులు చెప్పారు. ఇక సిబిఐ, ఈడీలాంటి సంస్థల్లో చంద్రబాబు మనుషులు ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పటికే చాలా సార్లు ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పటి వరకూ అధికారంలో లేని జగన్ ఈ వ్యవస్థల విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. అయితే జగన్‌కి ఒక బిగ్గెస్ట్ ఆప్షన్ మాత్రం ఉంది.

2014లో బియాస్ నది ప్రమాదంలో 20 మంది తెలుగు వాళ్ళు చనిపోయారు. ఆ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రమాద సమయంలో యాక్టివ్‌గా స్పందించిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా పొలిటికల్ మైలేజ్ బాగానే వచ్చింది. తాజా చంద్రబాబు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బోటు ప్రమాదంలో 22 మంది చనిపోయారు. మరి ప్రతిపక్ష పార్టీకి ఏమైనా కలిసొచ్చిందా? పైగా రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారని ఎల్లో మీడియాతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా పెయిడ్ వర్కర్స్ కూడా భారీగా ప్రచారం చేశారు. మరి 2014లో జరిగిన ప్రమాదం విషయంలో చంద్రబాబు చేసింది ఏంటి? చంద్రబాబు చేసింది ఒప్పయితే వైకాపా చేసింది తప్పెలా అవుతుంది? అక్కడే అసలు సూక్ష్మం ఉంది.

చంద్రబాబు అనుసరించే ఒక గొప్ప రాజకీయ వ్యూహం ఏంటంటే తాను ఏ విషయాన్ని తన రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుంది అని అనుకుని సీరియస్‌గా తీసుకున్నాడో ఆ విషయం ప్రజలందరిలోనూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తాడు. టిడిపికి, ఎల్లో మీడియాకు అనుకూలంగా ఉండే చాలా మంది మేధావులను, విశ్లేషకులను రంగంలోకి దింపుతాడు. కొన్ని సందర్భాల్లో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణను కూడా రంగంలోకి దింపాడు చంద్రబాబు. అలాగే తాను అడ్డంగా అవినీతి వ్యవహారాల్లో దొరికిపోయినప్పుడు కూడా చంద్రబాబు ఇదే సూత్రం ఫాలో అవుతాడు. టిడిపి భజన మీడియాతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉండే కొంతమంది పాపులర్ అండ్ మేధావులుగా పేరు బడ్డవారు మీడియా ముందుకు వచ్చి ….అవినీతి అంతటా ఉన్నదే కదా అని రాగాలు తీస్తారు. మార్గదర్శి అక్రమాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసును కోర్ట్‌లు విచారణకు స్వీకరిస్తే చంద్రబాబుతో పాటు, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణతో సహా ఇంకో ఎంతమంది తప్పుబట్టారు. రామోజీని సమర్థించారు. అలాగే చంద్రబాబు తప్పు చేస్తూ దొరికిపోయినప్పుడు ఎవ్వరూ స్పందించకుండా ఉండేలా చేయడంలో కూడా బాబు సిద్ధహస్తుడు. వైఎస్ జగన్ ఈ విషయంలోనే పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు.

విజయవాడ స్కామ్, బోటు ప్రమాదం, పుష్కర ప్రమాదం, రాజధాని తాత్కాలిక భవనాలలో చిన్న వర్షానికే నీళ్ళు కారడం, ప్రత్యేక హోదాకు మంగళం పాడడం, ప్యాకేజ్‌కి కూడా దిక్కులేకపోవడం, రైల్వేజోన్ విషయంలో అతీగతి లేకపోవడం….ఇలా ఎన్నో చంద్రబాబు వైఫల్యాలు కనిపిస్తున్నాయి. తాను చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాడు……కేంద్రం నుంచీ కూడా ఏమీ తీసుకురాలేని అసమర్థత బాబుది. మరో మాటలో చెప్పాలంటే ఓటుకు కోట్లు కేసు పుణ్యమాని మోడీ, కెసీఆర్ దగ్గర సాగిల పడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ వైఎస్ జగన్ పోరాటాలేవీ కూడా చంద్రబాబుని కదిలించలేకపోతున్నాయి. ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తించలేకపోతున్నాయి. అసలు ముందుగా ప్రజలందరిలోనూ చర్చనీయాంశం కాలేకపోతున్నాయి.

అదే నంది అవార్డ్స్ విషయం తీసుకుందాం. ఈ విషయంపై ఇప్పటి వరకూ జగన్ స్పందించింది లేదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టికీ ఇష్యూ వెళ్ళింది. ప్రభుత్వ పక్షపాతం, టిడిపి వర్గం వారికే పట్టం కట్టడం లాంటి విషయాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళు అని కాకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు కాబట్టి. నంది అవార్డ్స్ విషయాన్ని కూడా జగన్ పార్టీ టేకప్ చేసి ఉంటే ఈ స్థాయిలో స్పందన వచ్చి ఉండేదికాదు. ఇప్పుడు జగన్ ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే. సాక్షి మీడియా నేర్చుకోవాల్సిన పాఠం ఇదే.

ప్రభుత్వ లోపం, చంద్రబాబు తప్పులు బయటపడిన వెంటనే జగన్‌తో పాటు, రోజా, అంబటి లాంటి వాళ్ళు మాట్లాడితే అంతా కూడా రాజకీయం అవుతుంది. ఎటు తిరిగి టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా కూడా చంద్రబాబును సమర్థిస్తూ మాట్లాడతారు కాబట్టి రాజకీయంగా రెండు పార్టీలు తిట్టుకుంటున్న కలర్ వస్తుంది. సాక్షి మీడియాతో జగన్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు స్పందించడం ఒక్కటే కాకుండా చంద్రబాబు తప్పులు, వైఫల్యాలను చూస్తూ ఆవేధన చెందుతున్న చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగలు స్పందనకు కూడా ప్రాముఖ్యతనిస్తూ, వైకాపా పోరాటాల్లో వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తూ ఉంటే మాత్రం చంద్రబాబు కచ్చితంగా డిఫెన్స్‌లో పడతాడనడంలో సందేహం లేదు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా అని జగన్‌ని లోకేష్ విమర్శిస్తే ఎవరూ ఏమీ అనలేదు. కానీ సినిమా వాళ్ళందరినీ కలిపి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని అనడంతో లోకేష్‌ని ఉతికి ఆరేశారు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో లోకేష్‌ని, లోకేష్ వ్యాఖ్యలను ఓ స్థాయిలో వెటకారం చేస్తూ ఉన్నవారు ఎందరో. తన పార్టీ నాయకులతో పాటు ప్రజల్లో నుంచి కూడా వివిధ వర్గాలకు చెందిన మేధావులను, ఆలోచనాపరులను స్పందింపచేసేలా జగన్ వ్యూహరచన చేసుకుంటే మాత్రం టిడిపితో పాటు ఆ పార్టీ భజన మీడియాకు కూడా ప్రత్యేక హోదా లాంటి విషయాలపైన వ్యతిరేకంగా మాట్లాడడం అంత ఈజీకాదు. అలా మాట్లాడినా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. కానీ మొదటి నుంచీ కూడా జగన్‌ది మాత్రం ఒంటరి పోరాటమే. ఆ ఒంటరి పోరాటంతో పాటు కాస్త సమాజంలో ఉన్న అన్ని వర్గాల మేధావులను, ఆలోచనాపరులను కూడా కలుపుకుని పోతూ…..అవసరమైతే వాళ్ళతో సదస్సులు నిర్వహిస్తూ ముందుకు వెళితే మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా జగన్ బలం చాలా పెరుగుతుందనడంలో సందేహం లేదు. అలాగే చంద్రబాబు అండ్ కో కూడా ఇప్పుడు చేస్తున్న స్థాయిలో జగన్‌పైన విమర్శల దాడి చేయలేరు. 2019లో ఎలా అయినా అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ తనతో పాటు సమాజంలో ఉన్న వివిధ వర్గాల మేధావులను, ఆలోచనాపరులను కలుపుకుని పోవడం మాత్రం తప్పదు. అలాగే సాక్షి మీడియా కూడా ఎంతసేపూ వైకాపా నేతల స్పందనలకే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న మేధావులు, ఆయా రంగాలకు చెందిన రిటైర్డ్ పీపుల్ స్పందనలను కూడా ఎలివేట్ అయ్యేలా చేస్తే ప్రజల్లో మంచి స్పందన వస్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -