Sunday, May 12, 2024
- Advertisement -

బెబ్బులిలా గ‌ర్జించిన ఢీల్లీ డేర్‌డేవిల్స్… కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యార్ అదుర్స్‌ ..

- Advertisement -

కెప్టెన్ మార్పు ఏమో గాని ఢిల్లీ డేర్ డేవిల్స్ ద‌శ తిరిగింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు విజయం రుచి చూపించాడు. ఢిల్లీ డేర్ డేవిల్స్ కేకేపై క‌సితీరా ప్ర‌తీకారం తీర్చుకుంది. శుక్రవారం సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్లలో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా గర్జించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఊచకోతకు ఓపెనర్‌ పృథ్వీ షా సొగసైన షాట్లు తోడవడంతో కోల్‌కతా ఈసారి తోకముడిచింది.

కెప్టెన్ పగ్గాలు అందుకున్న శ్రేయాస్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయి ఆడాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 40 బంతుల్లో మూడు ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. కేకే బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది.

ఓపెనర్లు పృథ్వీషా (62), కోలిన్ మన్రో (33) శుభారంభాన్ని ఇచ్చారు. మన్రో అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. బంతులను ఎడాపెడా బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. రిషబ్ పంత్ గోల్డెన్ డక్‌గా అవుటైనా తర్వాత బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 220 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా పరుగుల వేటలో చతికిల పడింది. వికెట్లు టపటపా రాల్చుకుంది. ఆదుకుంటారనుకున్న రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, శివమ్ మావి, పీయూష్ చావ్లా‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పది ఓవర్లు ముగిసే సరికి ఐదు కీలక వికెట్లను కోల్పోయిన కార్తీక్ సేన.. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆండ్రూ రసెల్ ( 44) పోరాడినా అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగుల వద్ద కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది.

93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదింటిలో ఓడి రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -