ఐపీఎల్ 2026కి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించిన నేపథ్యంలో, భారత్–బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రానున్న బంగ్లాదేశ్ పర్యటనపై బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ప్రస్తుతం అత్యంత దిగజారిన స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు, వేగంగా క్షీణిస్తున్న సంబంధాల ప్రభావం క్రికెట్‌పైనా పడుతోంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ, ఐపీఎల్ 2026కి ముందు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజూర్ రహ్మాన్‌ను KKR జట్టు నుంచి తొలగించాలని సూచించింది. బీసీసీఐ ఆదేశాలతో రహ్మాన్‌ను జట్టు నుండి తప్పించింది కేకేఆర్.
ముఖ్యంగా, భారత్ జట్టు ఆగస్టు 2026లో బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండగా, ఇప్పటికే ఆ సిరీస్‌ను మరోసారి వాయిదా వేసి సెప్టెంబర్‌కు మార్చారు. షెడ్యూల్ విడుదలైనా, ఈ పర్యటన జరుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా అనిశ్చితి నెలకొంది. రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ సిరీస్‌లో ఆడేందుకు బీసీసీఐ ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ పరిస్థితి భారత్–పాకిస్థాన్ సంబంధాల మాదిరిగా మారే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో భారత్, బంగ్లాదేశ్ జట్లు గ్లోబల్ టోర్నీల్లో మాత్రమే, అది కూడా న్యూట్రల్ వేదికల్లోనే ఎదురుపడే పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు.
