Sunday, May 12, 2024
- Advertisement -

ముక్కోణ‌పు సిరీస్‌లో భారత్ బోణి…బంగ్లాపై విజ‌యం

- Advertisement -

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (55: 43 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఫాస్ట్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్ (3/38), విజయ్ శంకర్ (2/32) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమవగా.. లక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసింది.

శ్రీలంకతో గత మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 174 పరుగులు చేసినా అనూహ్యంగా ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్‌లో పట్టుదలతో ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17: 13 బంతుల్లో 3×4) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓ స్థానం ముందుకు వచ్చిన రిషబ్ పంత్ (7: 8 బంతుల్లో 1×4) బంతిని వికెట్లపైకి ఆడుకుని బౌల్డయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ బాది ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్ ఆడేశాడు. సురేశ్ రైనా (28: 27 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి ధావన్ మూడో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. జట్టు స్కోరు 108 వద్ద రైనా, 123 వద్ద ధావన్ ఔటైనా.. చివర్లో మనీశ్ పాండే (27 నాటౌట్: 19 బంతుల్లో 3×4), దినేశ్ కార్తీక్ (2 నాటౌట్)‌తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు

మొద‌ట టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (15: 16 బంతుల్లో 2×4), సౌమ్య సర్కార్ (14: 12 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఐదు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం ముష్ఫికర్ రహీమ్ (18: 14 బంతుల్లో 2×4, 1×6), కెప్టెన్ మహ్మదుల్లా (1) నిరాశపరిచారు. ఈ దశలో జట్టు స్కోరు బోర్డు నడిపించే బాధ్యతలు తీసుకున్న లిటన్ దాస్ (34: 30 బంతుల్లో 3×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. షబ్బీర్ రెహ్మాన్‌(30: 26 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి ఐదో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

భారత ఫీల్డర్లు శార్ధూల్ ఠాకూర్, సురేశ్ రైనా, వాషింగ్టన్ సుందర్ వరుసగా క్యాచ్‌లు వదిలేయడం కూడా ఈ జోడీకి కలిసొచ్చింది. జట్టు స్కోరు 107 వద్ద దాస్ ఔటవడంతో మళ్లీ బంగ్లాదేశ్ తడబడింది. చివర్లో హసన్ (3), రుబెల్ హుస్సేన్ (0) పేలవరీతిలో వికెట్లు చేజార్చుకోవడంతో బంగ్లాదేశ్ 139 పరుగులకే పరిమితమైంది. శ్రీలంకతో గత మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన విషయం తెలిసిందే.టోర్నీలో తర్వాత మ్యాచ్ బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య శనివారం రాత్రి జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -