ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని…ప్రస్తుత ప్రభుత్వ చర్యలను గమనిస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు.
ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని…ఈ నిబంధనను ఇప్పటిదాకా పాటించలేదన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని…విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని…చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని… ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
