ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బెయిల్ పై వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్‌కు వెళ్లిన కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఆప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం పదవి చేపడతానని చెప్పారు.
రేపు జరిగే ఆప్ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందా.. లేకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే కేజ్రీవాల్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని రద్దుచేస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోతే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసి ప్రజల్లోకి వెళ్లాలనే దానిని కూడా కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే అతిశీ, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ రాజకీయాల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే.
షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది.అయితే నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు కేజ్రీవాల్. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
