వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ…. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనపై ఉన్న పలు అవినీతి కేసులను శాశ్వతంగా మూసివేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్య ఫిర్యాదుదారులను బెదిరించి, ఒత్తిడి తెచ్చి కంప్లైంట్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని బొత్స ఆరోపించారు.
చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ కేసు, అమరావతి రింగ్ రోడ్ అక్రమాలు, ఫైబర్నెట్ కుంభకోణం, లిక్కర్ సిండికేట్ కేసు వంటి ప్రధాన అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుల్లో ఏ మాత్రం పురోగతి కనిపించకపోవడం అనుమానాస్పదమని, దర్యాప్తు సంస్థలను నియంత్రించి కేసులను దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని వెంటనే అరికట్టేందుకు రాష్ట్ర గవర్నర్ తక్షణ జోక్యం అవసరమని బొత్స డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి అవినీతి కేసులను రద్దు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పని హెచ్చరించారు. గవర్నర్ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగి, ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని బొత్స పేర్కొన్నారు.
బొత్స చేసిన తాజా ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి. ఇప్పటికే అవినీతి కేసులు ప్రజల్లో చర్చనీయాంశంగా నిలిచిన సమయంలో ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ దిశగా సాగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
