ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణల కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగా, తన వాదనను వ్యక్తిగతంగా కోర్టు ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నానని దానం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు కొనసాగితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి దిశగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఏ క్షణానికైనా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడే అంటే ఇప్పుడే రాజీనామా చేస్తా… నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని దానం పేర్కొన్నారు.
తాను 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తుచేసుకున్న దానం, ప్రజా సమస్యలపై పోరాటం తనకేం కొత్త కాదన్నారు. ఎమ్మెల్యే అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సాగుతోందని, తాను అక్కడ తన వాదనను బలంగా వినిపిస్తానని తెలిపారు.
దానం నాగేందర్ శుక్రవారం తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే అన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి
