ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చిట్‌చాట్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. “సమస్యలు ఉన్నంతవరకు నా స్టేటస్‌లు ఆగవు, నా ట్వీట్లు ఆగవు” అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు సరిగా లేవని, కనీస వసతులు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల పాటు ప్రజలు వైసీపీని విమర్శించారని గుర్తుచేశారు. అయితే రేపు తమపై విమర్శలు రావద్దనే ఆలోచనతోనే సమస్యలను ముందుకు తెస్తున్నానని తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని, ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
అవినీతిపై ఆయన కఠినంగా స్పందిస్తూ “నేను అవినీతి చేయను, చేయనివ్వను” అన్నారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. గుడ్ గవర్నెన్స్ ర్యాంకింగ్‌లో తిరువూరు మంచి స్థానం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన వాట్సాప్ స్టేటస్‌లపై ఎవరూ ఏమీ అడగలేదని, తాను కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
