బీఆర్ఎస్ పార్టీ పరాజయంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత కవిత. ఢిల్లీ లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని కేటీఆర్ చెప్పడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. “ఒక్కసారి గతాన్ని రివైండ్ చేసుకోండి. నేను జైలుకు వెళ్లే వరకు ఒక్కసారైనా కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ప్రెస్ మీట్ పెట్టారా?” అని ప్రశ్నించారు.
తనకు కష్టకాలంలో పార్టీ నుంచి తగిన మద్దతు లభించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా తనకు బలంగా నిలవలేదని విమర్శించారు. పార్టీ పరాజయానికి ఢిల్లీ లిక్కర్ కేసు మాత్రమే కారణమని చెప్పడం వాస్తవాలను మసకబార్చే ప్రయత్నమని ఆమె అన్నారు.
ఇళ్ల పంపిణీ, ఉద్యోగాల కల్పనలో విఫలం కావడం, అర్హతలేని వారికి టికెట్లు ఇవ్వడం, నాయకత్వంలోని అహంకార ధోరణి—ఇవే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి అసలు కారణాలని కవిత వ్యాఖ్యానించారు. పార్టీ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఆత్మపరిశీలన అవసరమని ఆమె సూచించారు.
