- Advertisement -

రాజకీయాల్లోకి కొండా వారసురాలు..

- Advertisement -

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, ఆయన కుమార్తె కొండా సుస్మిత ప్రకటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

“నా కన్నా నా కూతురు సుస్మిత ధైర్యవంతురాలు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఎవరినీ వదిలిపెట్టదు. ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది” అంటూ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గానికి తన కూతురు అండగా నిలుస్తుందని, ప్రజల కోసం పోరాడే తత్వం ఆమెకు ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సుస్మిత పటేల్ పరకాల నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంలో కొండా సుస్మిత కూడా స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. “నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు సేవ చేస్తాను. మా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం పరకాల నుంచే ప్రారంభమైంది. నా రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది” అని తెలిపారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

బుధవారం వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో పాల్గొన్న సుస్మిత, స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. పరకాల ప్రజల బాధలు తీరుస్తానని, ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. “నా తండ్రి ప్రశాంతంగా మాట్లాడమని చెప్పడంతో నెమ్మదిగా మాట్లాడుతున్నాను, లేకపోతే మరోలా ఉండేది” అని వ్యాఖ్యానించడంతో సభలో చప్పట్లు మోగాయి.

మరోవైపు మంత్రి కొండా సురేఖ కుమార్తెగా సుస్మిత రాజకీయ రంగప్రవేశం చేయడం పరకాల రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా దంపతుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, యువతకు ప్రాతినిధ్యం వహించే నేతగా ఎదగాలనే సంకల్పంతో సుస్మిత ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ పరిణామాలతో పరకాల నియోజకవర్గ రాజకీయాలు రాబోయే ఎన్నికల దిశగా మరింత ఆసక్తికరంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -