టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే తర్వాత విడుదల తేదీని మార్చి 19 నుంచి ఏప్రిల్ 10కు వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో సినిమా వాయిదాకు గల కారణాన్ని అడివి శేష్ తాజాగా వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ధురంధర్ 2’ సినిమా విడుదలే ‘డెకాయిట్’ వాయిదాకు ప్రధాన కారణమని చెప్పారు.
మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కావడంతో మా సినిమాకు అవసరమైన స్థాయిలో థియేటర్లు లభిస్తాయనే హామీ లేదు. అందుకే విడుదల తేదీని మార్చడం ఒక ప్రాక్టికల్ నిర్ణయంగా తీసుకున్నాం అని అడివి శేష్ తెలిపారు.
ధురంధర్ 2 సినిమా ‘డెకాయిట్’పై ఎంత ప్రభావం చూపిందని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కథాపరంగా ఎలాంటి ప్రభావం లేదు. కానీ విడుదల విషయంలో మాత్రం ఉంది. ‘డెకాయిట్’ ఒక ఎమోషనల్ లేయర్స్ ఉన్న ప్రేమ కథ, కానీ యాక్షన్ చిత్రంగా చూపించబడుతుంది. మరోవైపు ‘ధురంధర్’ దేశంలోనే భారీ చిత్రంగా వస్తోంది. అందుకే ఆ సినిమాకు గౌరవం ఇవ్వడం అవసరం అనిపించింది అన్నారు.
అదే సమయంలో మంచి ప్రదర్శన కోసం, ఎక్కువ థియేటర్లు దక్కేందుకు విడుదల తేదీని మార్చామని అడివి శేష్ వివరించారు. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
