కామారెడ్డి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోషించే స్థోమత లేక ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులోకి తోసేసిన తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో చిన్నారి గల్లంతైంది.
కామారెడ్డి పట్టణంలోని ఆర్పీ నగర్ ప్రాంతంలో ఇస్మాయిల్–షబీనా దంపతులు తమ ముగ్గురు కూతుళ్లు షీపత్ (8), ఆయత్ (7), మరియం (5)లతో కలిసి నివసిస్తున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా, షబీనా కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
శనివారం రోజున షబీనా కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఇస్మాయిల్ మొదట పిల్లలను దోశ తినిపించేందుకు తీసుకెళ్లానని, ఆ సమయంలో ఆటోకు గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయానని తెలిపాడు.
అయితే సీసీటీవీ దృశ్యాలు మరియు ఇస్మాయిల్ చెప్పిన వివరాలు సరిపోలకపోవడంతో పోలీసులు అతడిని మళ్లీ కఠినంగా విచారించారు. ఆ సమయంలో తానే పిల్లలను పెద్ద చెరువులోకి తోసేశానని ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే నిలబడి ఉన్నానని కూడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వెంటనే సహాయక బృందాలతో కలిసి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అయితే మరో చిన్నారి మృతదేహం ఇంకా గల్లంతైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
