దేశ రాజధానిలోని ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ విహార్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఒక మైనర్ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం, 16 ఏళ్ల బాలుడు గౌతమ్ విహార్ ప్రాంతంలోని వీధిలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అడ్డుకున్నారు. నిందితులు వెంట తెచ్చుకున్న కత్తితో బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఈశాన్య ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు.పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సిసిటివి కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేక ఏదైనా చిన్నపాటి గొడవ దారితీసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.పట్టపగలే నివాస ప్రాంతంలో ఇలాంటి ఘోరం జరగడంతో గౌతమ్ విహార్ నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో నేరాల సంఖ్య పెరుగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మైనర్ల మధ్య గొడవలు ఇలా ప్రాణాలు తీసే వరకు వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
