తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె పార్టీకి “తెలంగాణ ప్రజా జాగృతి” అనే పేరు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ గుర్తుగా “ధర్మగంట”ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీని అధికారికంగా రానున్న శ్రీరామ నవమి సందర్భంగా ప్రకటించే యోచనలో కవిత ఉన్నారు. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తు కేటాయింపునకు సంబంధించి సీఈసీకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
అయితే పార్టీ పేరు, గుర్తు కేటాయింపులో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు …ఎన్నికల సంఘం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పార్టీ పేరు, గుర్తుపై క్లారిటీ ఇస్తామని తెలిపింది. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే, ఈ నెలలోనే కవిత తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కొత్త పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
