తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వ్యక్తిగత విమర్శలు, మహిళల గౌరవానికి భంగం కలిగించే పోస్టులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ తీరును తప్పుపడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అమ్మాయి ఫోటోలు, వీడియోల వ్యవహారంపై కవిత స్పందించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, అత్యుత్సాహంతో ఒక ఆడపిల్ల వ్యక్తిగత ఫోటోలను బయటపెట్టడం హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు.
ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగమే ప్రత్యక్ష కారణమని ఆమె ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ, ఒక మహిళ గౌరవాన్ని బజారున పడేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
భగీరథ్ దేశం విడిచి వెళ్లిపోకుండా తక్షణమే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా అడ్డుకుంటేనే, చట్టంపై మరియు పోలీసుల విచారణపై తెలంగాణ మహిళలకు నమ్మకం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేలా పోస్టులు పెట్టే ప్రతి అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలి.అలాంటి పోస్టులు పెట్టే వ్యక్తులను గుర్తించి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
