జగిత్యాల వేదికగా జరిగిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’పై సెటైర్లు వేశారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ’75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?’ జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత సెటైర్లు వేశారు. 75 ఏళ్లు వచ్చిన వ్యక్తిని నవ యువకుడిగా అభివర్ణిస్తే.. మరి రాష్ట్రంలోని అసలైన యువకుల పరిస్థితి ఏంటి? వారంతా ఏమవ్వాలి?” అని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అనడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, ప్రజలనే నిందించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు.
బీఆర్ఎస్ సభ పెట్టి ఉట్టి కథలు చెబితే.. కాంగ్రెస్ పిట్ట కథలు చెబుతోంది. కానీ ప్రజలు పడుతున్న అసలైన కష్టాల గురించి మాట్లాడే నాథుడే లేడు అని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని, ఎన్ని ఏళ్లయినా ఆ పార్టీ తీరు మారదని ఆమె కుండబద్దలు కొట్టారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఆ పార్టీ పని చేస్తోందని, ఉద్యమకారులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ప్రసంగంలో కవిత ‘కొత్త రాజకీయ పార్టీ’ గురించి సంకేతాలివ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాము పెట్టబోయే కొత్త పార్టీలో యువతకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ వస్తున్న కారణంగా, పబ్లిసిటీ మెటీరియల్‌కు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహకరించాలి అని కోరడం ద్వారా ఆమె తన తదుపరి కార్యాచరణను స్పష్టం చేశారు.
