తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కల్వకుంట్ల కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఎల్లుండి (శనివారం) ఆమె తన నూతన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తన చిరకాల స్వప్నమైన సామాజిక చైతన్యాన్ని రాజకీయ శక్తిగా మార్చే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆమె ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ సిద్ధాంతాలను, రాష్ట్ర అస్తిత్వాన్ని మరియు నైతిక విలువలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశమని కవితా వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీలేని పోరాటం,కిందిస్థాయి ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించడం, సిద్ధాంతపరమైన స్పష్టతతో కొత్త తరం రాజకీయాలను ప్రోత్సహించడం.
బిఆర్ఎస్ (BRS) పార్టీలో కీలక నేతగా ఉన్న కవిత, ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీ పెట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. “తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసమే నేను ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నాను” అని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఎల్లుండి జరిగే అధికారిక ప్రకటనలో పార్టీ జెండా, ఎజెండా మరియు భవిష్యత్ ప్రణాళికలను కవిత వెల్లడించే అవకాశం ఉంది.
