హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, ప్రధాన నిందితురాలు మరియు ఆమె ముఠా ఆచూకీ ఇంకా చిక్కకపోవడం గమనార్హం.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు, పనిమనిషి కల్పన అత్యంత పక్కా ప్లాన్‌తో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.తనూజ ఎక్కడ పడుకుంటుంది?,నగలు, నగదు ఎక్కడ భద్రపరుస్తారు?..అనే అంశాలపై కల్పన పూర్తి సమాచారాన్ని ముందే సేకరించి, దోపిడీకి స్కెచ్ వేసినట్లు తేలింది.
నిందితుల కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కల్పన తల్లిదండ్రులను పోలీసులు పూణేలో అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా కల్పన ఆచూకీని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.బెంగళూరులో ఉంటున్న కల్పన భర్తకు కూడా ఈ దోపిడీ మరియు హత్య గురించి ముందే సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు జరుగుతోంది.
నిందితురాలు గతంలో మధ్యప్రదేశ్, లక్నో మరియు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పనిమనిషిగా పనిచేసినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె గత ప్రవర్తన ఎలా ఉండేదనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి రంజన్ రే ఇంట్లో పనిమనిషిగా చేరిన కల్పన, తన అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి తనూజను హత్య చేసి, భారీగా నగలు, నగదుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ సాయంతో మరియు సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
