కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాలతో పాటు సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా నటుడు మంచు మనోజ్ మరియు ప్రముఖ సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడు ఎంతటి వారైనా వదలకూడదని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బండి సంజయ్ కొడుకు వ్యవహారం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు సమాజానికి చేటు అని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికల సంరక్షణ కోసం ఉద్దేశించిన పోక్సో కేసులో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరగకూడదని మనోజ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ పలుకుబడి లేదా అధికార బలంతో విచారణ పక్కదారి పట్టకుండా చూడాలని, బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని మరియు పోలీసులను కోరారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ ఈ ఉదంతంపై పరోక్షంగా స్పందిస్తూ తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేశారు.మీ కొడుకు లైంగిక దాడుల వంటి దారుణాలకు ఒడిగడితే, అతడిని కాపాడే ప్రయత్నం అస్సలు చేయకండి అని ఆమె హితవు పలికారు. తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయం నిందితుల్లో కలగాలని, అప్పుడే ఇలాంటి నేరాలు ఆగుతాయని ఆమె పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
