కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు.
బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేసు విచారణలో పారదర్శకత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. బాధితురాలు మైనర్ బాలిక కావడంతో, ఈ కేసును అత్యంత సున్నితంగా మరియు పకడ్బందీగా విచారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి నాయకత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరపడమే ఈ బృందం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన వల్లే విచారణలో స్వల్ప ఆలస్యం జరిగిందని, బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లు క్షణాల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 8వ తేదీన బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే, బండి సంజయ్ కుమారుడు కూడా ఫిర్యాదు చేశారని సీఎం వెల్లడించారు. ఎంత పెద్ద వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కూడా స్పందించారు.బండి సంజయ్ కుమారుడు చేసిన పనికి ఆయనకు లేదా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ తమ పార్టీ ఎంపీ మరియు కేంద్ర మంత్రి అయినప్పటికీ, ఈ వ్యవహారాన్ని వ్యక్తిగత కోణంలోనే చూడాలని, దీనికి పార్టీని బాధ్యులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
