వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 27) పార్టీ అత్యున్నత స్థాయి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి ముఖ్య నేతలు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వ విధానాలపై పోరుబాటే ప్రధాన ఎజెండగా ఈ సమావేశం జరగనుంద. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
ఈ కీలక సమావేశంలో పార్టీ అంతర్గత పునర్వ్యవస్థీకరణపై జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులపై నేతల నుంచి నివేదికలు తీసుకోనున్నారు. క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించే విషయమై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ తరఫున చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు ప్రజా ఉద్యమాల షెడ్యూల్‌ను రేపటి భేటీలో ఖరారు చేయనున్నారు. నేతలందరూ సమన్వయంతో ఉమ్మడిగా ముందుకు సాగాలని ఆయన సూచించనున్నారు.
వైసీపీ నిర్వహించనున్న ఈ కీలక సమావేశం సొంత క్యాడర్లో నూతన ఉత్సాహం నింపనుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని జగన్ ఇప్పటికే చెప్పడంతో రేపు జరగబోయే మీటింగ్‌లో జగన్ ఎలాంటి సందేశం ఇస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
